Seethakka : సీతక్క మేడారం సెంటరాఫ్ అట్రాక్షన్

మేడారం జాతరలో సీతక్కే సెంటరాఫ్ అట్రాక్షన్! అడవి బిడ్డగా, మంత్రిగా జాతర అంతా తానై నడిపించిన వైనం. డ్యాన్సులతో జోష్.. విమర్శలతో వేడి.. సీతక్క మార్కు మేడారంపై ప్రత్యేక కథనం.

Seethakka

విధాత, ప్రత్యేక ప్రతినిధి: సీతక్క అలియాస్ ధనసరి అనసూయ మేడారం జాతరలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మేడారం జాతర మొత్తంగా తనదైన మార్కు, భాగస్వామ్యం కనిపిస్తోంది. ప్రజల అందరితో కలిసిపోవడం, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతూ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సాగుతున్న సీతక్క స్థానికంగా పార్టీ కేడర్ తోనూ, ప్రజలతోనూ కలిసిమెలిసి సాగుతోంది. ఈ క్రమంలో సీతక్క పైన ప్రశంసలతోపాటు లోటుపాట్లకు ఆమెను బాధ్యురాలిని చేస్తూ తిట్లూ, శాపనార్ధాలు పెడుతున్న సందర్భాలున్నాయి. నచ్చిర వారు మెచ్చుకోలు మాటలు మాట్లాడుతూ అందలాన్నెక్కిస్తుండగా, గిట్టని వారు తిట్లతో దీవిస్తున్నారు. మంచీ, చెడుల్లో మొత్తంగా సీతక్క చుట్టూ మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సందర్భంగా ఎదురురవుతున్న లోటుపాట్లతో జాతర నిర్వహణ సాగుతోంది.

సీతక్క పరిచయడం అక్కరలేని పేరు

సీతక్క పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మేడారంలో జరుగుతున్న సమ్మక్క,సారలమ్మ జాతరకు సీతక్క సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారంటే అతిశయోక్తికాదు. స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఆదివాసీగా అందులో కూడా కోయ తెగకు చెందిన ఆడబిడ్డగా ప్రత్యేక గుర్తింపునూ, ముద్రను వేస్తూ తనదైనశైలిలో మేడారం జాతరలో కీలకభూమిక నిర్వహిస్తున్నారు. సీతక్క ములుగు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం ఇది మూడవ పర్యాయం.

మేడారం పునరుద్ధరణ క్రెడిట్ లో పెద్ద వాటా

సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సమ్మక్క,సారలమ్మ తాడ్వాయి మండలంలో మేడారం ఓ కుగ్రామం. ఈ మేడారంలోనే సబ్బండవర్గాలకు చెందిన కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సమ్మక్క, సారలమ్మలు కొలువై ఉన్నారు. ఈ వనదేవతలను ఆదివాసీలు ముఖ్యంగా కోయలు తమ ఇలవేల్పుగా భావిస్తారు. ఈ సమ్మక్క, సారలమ్మ జాతర రెండేళ్ళకోసారి మాఘశుధ్ధ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఈ జాతర ప్రపంచంలో పేరెన్నికగల గిరిజన జాతరల్లో అతిముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. ఆసియా ఖండంలో ఇంత పెద్ద జాతర ఎక్కడా జరుగదంటే మేడారానికి ఉన్న గుర్తింపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చూ. అలాంటి మేడారం సమ్మక్క, సారలమ్మలు సీతక్క ఇలవేల్పుకావడం గమనార్హం. కోయ గొట్టు గోత్రాల ప్రకారం సమ్మక్క, సారలమ్మలకు సీతక్క అడ్డబిడ్డ వంశానికి చెందినవారు కావడం మరో విశేషం.

తన కలనెరవేర్చుకునే మంచి ఛాన్సు

ఆదివాసీ బిడ్డగా,తమ ఇంటి ఇలవేల్పుగా భావించే తన నియోజకవర్గ పరిధిలోని మేడారాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేసుకునే అవకాశం ఈ సారి మంత్రిగా సీతక్కకు లభించింది. మేడారం పట్ల సెంటిమెంటే కాకుండా సానుకూలంగా ఉండే నేత, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, సీఎంకు దగ్గరి వ్యక్తుల్లో సీతక్క ఒకరనే అభిప్రాయంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం తదితర అనేక అంశాలు కలిసొచ్చి మేడారం పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్, శాశ్వత కార్యక్రమాలు చేపట్టేందుకు అనుకూలించింది. రూ.251 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పునురుద్ధరణ పనుల్లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకరతోపాటు సీతక్క ప్రత్యేకంగా కేంద్రీకరించి చాలెంజ్ గా తీసుకుని పనులు చేపట్టారు. పనుల్లో ఇంకాకొన్ని పూర్తికానప్పటికీ జాతరనాటికి భక్తులకు ఇబ్బందిలేకుండా వారనుకున్న లక్ష్యం ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు శ్రమించి సక్సెస్ అయ్యారు.

ప్రజలూ, పార్టీ శ్రేణులతో మమేకం

సీతక్క మేడారం జాతర అంతటా తానై ముందుంటున్నారు. వచ్చే జనంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూనే తన సామాజికవర్గమైన ఆదివాసీలతో అడుగులో అడుగేస్తున్నారు. ప్రజలతో కలిసిసాగుతూనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులూ, కార్యకర్తలను ఎప్పటికప్పుడు కలుసుకుంటూ తగిన సూచనలు సలహాలిస్తున్నారు. ఈ జాతర ప్రకటన వెలువడిన తర్వాత వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికలను, తాజాగా ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల్లో ఇంచార్జ్గా, నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషిచేస్తూ ముందుకు వెళుతున్నారు.

అధికారులూ, ప్రజాప్రతినిధులతో సమన్వయం

రాష్ట్ర వ్యాప్తంగా సీతక్క అంటే ఒక క్రేజీ ఉన్న నేపథ్యంలో అందరినీ పలకరిస్తూనే జాతరకు వచ్చే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఆతిథ్యమిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంచార్జ్ మంత్రి పొంగులేటి, దేవాదాయశాఖ మంత్రి సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరిలను కలుపుకునిపోతూ అటుపోట్లు, మధ్యలో విమర్శలు వచ్చినా జాతర పనులు సాఫీగా సాగేవిధంగా కృషి సాగించారు. జాతరకు ముందూ తర్వాత వచ్చిన అనేక మంది వీవీఐపీ, వీఐపీలను సముచితంగా గౌరవించడంలో ముందున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్, గవర్నర్ జిష్టుదేవ్ శర్మ, రాష్ట్ర మంత్రి వర్గమంతా వచ్చి కేబినెట్ సమావేశం నిర్వహించిన సందర్భంలో తగిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి చెందిన అనేక మంది అధికారులు జాతర సందర్భంగా వచ్చిన నేపథ్యంలో వారికి తనదైన పద్ధతిలో స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు.

వడ్డెలతో కలిసి మెలిసి

జాతరకు వచ్చీపోయే వారితో మంచీచెడూ మాట్లాడుతూనే జాతరలో జరిగే కార్యక్రమంలో పూజారులతో కలిసి ఆదివాసీ బిడ్డగా కలిసిపోతున్నారు. ఇది ఆమెకు సానుకూలంశంగా చెప్పవచ్చూ. జాతరకు ముందు జరిగే కార్యక్రమాలతో పాటు అన్నింటా పాల్గొంటున్నారు.గుడిమెలిగే,మండమెలిగే పండుగల్లో పడిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ,సమ్కక్క వనదేవతలను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో తనదైన పాత్ర నిర్వహిస్తున్నారు.

జోష్ నింపిన నృత్యాలు

మేడారం జాతరకు మంత్రి సీతక్క డ్యాన్సులు కొత్త జోష్ నింపాయి. జాతర సందర్భంగా సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి కాలుకదుపుతున్నారు. ఇక జాతరలో వనదేవతలను తీసుకొచ్చే క్రమంలో సాంప్రదాయ నృత్యాల్లో భాగస్వామ్యమయ్యారు. సారక్కను తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు అధికారులు, సహచర మంత్రి అడ్లూరి , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యువ పోలీసు ఉన్నతాధికారులు సైతం జోష్ కు లోనై తీన్మార్ స్టెప్పులు వేసి డోలు శబ్దాలకు అనుకూలంగా నృత్యం చేసి హైలెట్ గా నిలిచారు. జాతర సందర్భంగా మేడారం వచ్చిన న్యూజిలాండ్ కు చెందిన మావోరి తెగ ప్రదర్శించిన నృత్యం సందర్భంగా వారితో పాటు సీతక్క నృత్యం చేసి అలరించారు.

విప్లవ జీవితం దోహదం

పూర్వాశ్రమంలో విప్లవపార్టీలో పనిచేసిన అనుభవం, ఆచరణ సీతక్క ప్రజలతో కలిసిపోయేందుకు స్వభావికంగానే ఎంతో దోహదం చేస్తోంది. ఈ క్రమంలోనే జాతర తేదీలు ప్రకటనకు ముందు నుంచి మేడారం పై ప్రత్యేక శ్రద్ధతో , మంత్రిగా, అధికార పార్టీకి చెందిన నేతగా తొలిసారి లభించిన ఈ అవకాశాన్ని వందశాతం వినియోగించుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.

తిట్లూ, విమర్శలూ తప్పలేదు

సీతక్క అంతా తానై వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పునరుద్ధరణలో బ్రాహ్మణిజాన్ని చొప్పిస్తున్నారనే విమర్శలకు సీతక్క బాధ్యత వహించాలంటూ విమర్శలు వచ్చాయి. మేడారం జాతర బాధ్యతలు మోస్తున్నందున మంచికి ఎంతైతే మెచ్చుకోలు లభిస్తుందో, లోటుపాట్లు తలెత్తినప్పుడు ఆమెను తిడుతున్న వారున్నారు. రాజకీయంగా సీతక్క అంటే వ్యతిరేకించేవారు సహజంగానే ఆమెను విమర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మేడారం పునరుద్ధరణ పనులను సైతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో మేడారం వచ్చీపోయే సందర్భంలో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయి భక్తులు నరకయాతన అనుభవించిన నేపథ్యంలో ఆమెను బాధ్యరాలిగా చేస్తూ అధికారుల పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జాతర నిర్వహణలో ప్రధానమైన అంశాన్ని విస్మరించారని, జాతర నిర్వహణలో ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

Nalgonda : దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ !
Medaram Jatara : మేడారం జాతరలో వారు ‘పరిశుద్ధులు’…అంటురోగాలు వెంటాడకుండా చర్యలు

Latest News