Chiranjeevi | టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
కవలల రాకతో కొణిదెల కుటుంబంతో పాటు కామినేని కుటుంబం కూడా ఆనందోత్సాహాల్లో తేలుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు ఈ వార్తను పండుగలా జరుపుకుంటున్నారు.
చిరంజీవి భావోద్వేగ స్పందన
ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. రామ్ చరణ్, ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటినుంచో మా ఇంట శుభం కలగాలని అందరూ కోరుకున్నారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ మా కుటుంబానికి ఎంతో ఆనందం ఇస్తోంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
మెగా కుటుంబంలోకి ఇద్దరు చిన్నారులు రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు తమ తమ వేదికల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ చరణ్–ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లింకార అక్కగా ప్రమోషన్ పొందిందని, చిన్నారుల రాకతో కుటుంబంలో ఆనందం మరింత పెరిగిందని పేర్కొన్నారు.
అభిమానుల్లో ఉత్సాహం
మెగా కుటుంబానికి ఎప్పటినుంచో ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. కవలల జనన వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబుల్ గుడ్ న్యూస్‌తో మెగా వారసత్వానికి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండటంతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.
