కాంగ్రెస్ వస్తే పరిశ్రమలన్నీ కర్ణాటక వశం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • Publish Date - November 4, 2023 / 03:13 PM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే తెలంగాణ పరిశ్రమలన్నింటినీ కర్ణాటకకు తరలించుకుపోతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో నెలకొల్పనున్న ఐ ఫోన్ పరిశ్రమను తరలించుకుపోయేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.


గతంలో తన పేరు, తన తండ్రి పేరుతో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి ఎన్నికల్లో పోటీ చేయించి తనను ఓడించాలని కుట్ర చేశారని, కానీ విజ్ఞులైన మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు గమనించి తనకు అత్యధిక మెజారిటీని ఇచ్చి… కుట్ర చేసిన వారికి గుణపాఠం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని దౌర్భాగ్యులు ఇక్కడ ఉన్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి చిన్న అవకాశం ఇచ్చినా ప్రస్తుతం రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోవడమే కాకుండా అన్నీ అడ్డంగా అమ్మేస్తారన్నారు.

టిక్కెట్లు అమ్ముకున్నారు

– సయ్యద్ ఇబ్రహీం

కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలు, మైనార్టీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ డబ్బులకు టికెట్లు అమ్ముకుని బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా అన్యాయం చేశారని, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం విమర్శించారు. పార్టీకి జీవితాంతం సేవ చేసిన వారిని కరివేపాకులా తీసిపారేసి మతతత్వ పార్టీల నుంచి రాత్రికి రాత్రి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితం మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ ద్వారా మొదలైందని, తన ఊపిరి ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి భవిష్యత్తులోనూ ఉండాలంటే మరోసారి శ్రీనివాస్ గౌడ్ ను అపూర్వమైన మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే, అక్కడ అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీల పట్ల వ్యవహరించిన కఠినమైన, దుర్మార్గమైన వైఖరి వల్లేనని అన్నారు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు ఎంతో చక్కని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

బీజేపీలో డబ్బులుంటే

హౌఆర్ యూ… లేకుంటే హూ ఆర్ యూ!

– మాజీ మంత్రి చంద్రశేఖర్

జాతీయ పార్టీ బీజేపీలో డబ్బులు ఉన్న వారిని ‘హౌఆర్ యూ’ అని పలకరిస్తారని, అదే డబ్బులు లేకుంటే మాత్రం ‘ హూ ఆర్ యూ’ అని అంటున్నారని మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ అన్నారు. సర్వేల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నామని అధిష్టానం ప్రకటించి, సీట్ల కేటాయింపులో మాత్రం వివక్ష ప్రదర్శించిందన్నారు. డబ్బులున్న నాయకులకు టికెట్లు కేటాయించిందన్నారు. బీసీలను సీఎం చేస్తామన్న బీజేపీ… బీసీ అభ్యర్థులకు మాత్రం టికెట్లు కేటాయించలేదన్నారు.


పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బీసీ నాయకుడు బండి సంజయ్ ను తొలగించి బీసీలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. షాద్ నగర్ లో పొలం దున్ని మహబూబ్ నగర్ లో విత్తనాలు వేస్తే ఎలా అని స్థానికంగా బీజేపీ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలామంది బీజేపీ నాయకులు ఓడిపోతామనే భయంతో పోటీ చేయడం లేదని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. గతంలో కనీవినీ ఎరుగని విధంగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మూడోసారి పెద్ద మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.