యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (Hong Kong) పరిశోధకులు వైద్య రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. కేన్సర్ ఏ భాగానికి వచ్చినా దానిని చివరి స్టేజ్‌లో నియంత్రించడం దాదాపుగా అసాధ్యం. కానీ లివర్ కేన్సర్ (Liver Cancer) చివరి అంకంలో ఉన్న ఓ రోగికి అరుదైన పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా దానిని సుసాధ్యం చేశారు. ఈ విధానంలో కేన్సర్‌ను నియంత్రించడం అనేది ఇదే మొదటిసారని వారు పేర్కొన్నారు.
ఈ విధానంలో వారు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీలను కలిపి ప్రయోగించారు. రేడియేషన్ థెరపీ ద్వారా ట్యూమర్ పెరగకుండా ప్రయత్నించారు. ఇమ్యునోథెరపీ ద్వారా ఆ కణతిని స్టేజ్ 1 లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విధానానికి వారు రెడ్యూస్ అండ్ రిమూవ్ అనే పేరును పెట్టారు.
కాలేయ కేన్సర్ స్టేజ్ 4తో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తికి ఈ విధానంలో చికిత్స చేసినట్లు లి కా ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ ఆల్బర్ట్ చాన్ చి యాన్ వెల్లడించారు. అతడి కాలేయానికి వెళ్లే రక్తనాళంలో 18.2 సెం.మీ. గడ్డ (Tumor) ఉండేదని దాని సైజును తగ్గించి ఆ గడ్డను తొలగించేశామని చెప్పారు. ఆ రోగి కుమారుడి నుంచి కాలేయ భాగాన్ని తీసుకుని అవయవ మార్పిడి చేశామని తెలిపారు. అక్టోబరులో ఈ ఆపరేషన్ జరగగా ప్రస్తుతం అతడికి కేన్సర్ లక్షణాలు ఏమీ లేవని చెప్పారు.
స్టేజ్ 4 కేన్సర్‌ను నిర్మూలించడానికి ప్రస్తుతం ఏ మార్గాలూ అందుబాటులో లేవని.. కాబట్టి తాము ప్రతిపాదించిన రెడ్యూస్ అండ్ రిమూవ్ పద్ధతిని అనుసరించొచ్చని ఆల్బర్ట్ పేర్కొన్నారు. తొలుత రోగి ఈ చికిత్సకు ప్రతిస్పందించే రేటు 60 శాతం ఉంటే దానిని ఇప్పుడు 80 శాతానికి తీసుకొచ్చామని ఆయన అన్నారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఈ చికిత్స సక్సెస్ రేటును పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు.
లివర్ కేన్సర్ ఎందుకొస్తుంది?
అన్ని రకాల కేన్సర్‌లలాగే కాలేయం (లివర్) కేన్సర్ ఎందుకొస్తుందన్న స్పష్టమైన కారణం లేదు. సిర్రోసిస్ అనే స్థితి వల్ల కాలేయం దిబ్బతింటే కేన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మద్యపానం అధికంగా చేయడం, దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడినా కేన్సర్ వచ్చే ప్రమాదముంది. మారిన జీవన శైలి కూడా కేన్సర్‌లు రావడానికి ఒక కారణమే.