విధాత, సూర్యాపేట: మానవులు ఎప్పుడూ ప్రేమ, కరుణ, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని లివింగ్ గాడ్ బాప్టిస్ట్ చర్చిలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాస్టర్లు, సువార్తికులకు పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా చైర్మన్ మామిడి సామ్సన్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి జగదీశ్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని అన్నారు. ఏసుక్రీస్తు ఈ లోకంలోని ప్రజలందరికీ ప్రేమ, అప్యాయతను నేర్పించారని, ఎదుటివారిని ప్రేమించేగుణం మనలో ఉండాలని, ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా శాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత పదేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దుస్తులు పంపిణీ చేశారన్నారు. అదే సంప్రదాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ రెవరెండ్ ఎం ప్రభుదాస్ ప్రసంగించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ నాయకులు పూర్ణ శశికాంత్, పాస్టర్స్ ఫెలోషిప్ నియోజకవర్గ అధ్యక్షులు మీసాల గోవర్ధన్, పట్టణ అధ్యక్షులు మీసాల ప్రభుదాస్, ఫాదర్ మరియన్న, పాస్టర్ జవహర్పాల్ జాకబ్ బాబురావు, డేవిడ్ రాజ్, సత్య ప్రకాష్, లింగా నాయక్, రాజరత్నం, బొడ్డు మత్తయ్య, సాల్మన్ రాజు, మచ్చ ఏసుపాదం, మని దాసు, పద్యం రాజు, కోట సామ్సన్, జాన్ దుర్గాప్రసాద్, చలో చంద్రశేఖర్ పాల్గొన్నారు.