Kadiyam Srihari | ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి ఆరూరి ఫ్రస్టేషన్

  • Publish Date - April 12, 2024 / 12:49 PM IST

  • అరూరివి దిగజారుడు విమర్శలు

  • అవినీతి నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం

  • మందకృష్ణను ఎవరు నమ్మే పరిస్థితి లేదు

  • కుల, మతాల చిచ్చు పెట్టే కుట్ర

  • కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు

  • కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం సవాల్

 

విధాత, వరంగల్ ప్రతినిధి: ఓటమి భయంతో బీజేపీ నాయకుడు ఆరూరి రమేష్ ప్రస్టేషన్లో తనపై, తన కుమార్తె కడియం కావ్య పై రకరకాల విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి ఖాయమని తెలిసి రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హనుమకొండ కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం, తన బిడ్డ, వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్య తో కలిసి మాట్లాడారు.

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారినందుకు తాను డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నేతల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుల నుంచి తాను ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తన కుమార్తె కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటుందని సవాల్ చేశారు.

ఆరూరి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారని ఆయన మర్చిపోతున్నట్లు కడియం గుర్తు చేశారు. పార్టీ మారిన అరూరి మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. నా జీవితం తెరచిన పుస్తకం మీ మాదిరిగా భూకబ్జాలకు అక్రమాలకు పాల్పడలేదని,రియల్ ఎస్టేట్, కోట్ల ఆస్తులు సంపాదించలేదని ఫైర్ అయ్యారు. ఓఆర్ఆర్ పక్కన భూకబ్జాలు, మండలానికో గెస్ట్ హౌస్ల వ్యవహారం చూసి వర్ధన్నపేటలో నిన్ను ఓడించారంటూ ఆరూరి పై తీవ్ర విమర్శలు చేశారు. కబ్జాలు అక్రమాలను చూసి ప్రజలు తిరగబడిన విషయం అప్పుడే మరిచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు.

టిడిపిలో సామాన్య కార్యకర్తగా ఉన్న ఆరూరి రమేష్ ను క్లాస్ 1 కాంట్రాక్టర్ గా మార్చింది నేనంటూ చెప్పారు. ఒక దళితుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఎదగాలని భావించి అప్పటి ఎస్‌ఈ తో మాట్లాడి ఎస్సారెస్పీ కాంట్రాక్ట్ ఇప్పించానని గుర్తు చేశారు. నేను కాదు వెన్నుపోటు పొడిచింది… నువ్వే అంటూ రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో నువ్వు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచేందుకు నేను సహకరించాను. 2018లో కూడా సహకరించాను, కానీ ఈసారి నేను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినందున ప్రచారంలో పాల్గొనలేదన్నారు.

ఎంపీ అభ్యర్థిగా కూడా రమేష్‌కే అవకాశం ఇవ్వాలని నేను కెసిఆర్ కు, ఆ పార్టీ అధిష్టానానికి సూచించాను.. కానీ నువ్వు బీజేపీలో చేరిపోయి నన్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.వెన్నుపోటు పొడిచి పార్టీ మారింది నువ్వన్నారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. చట్టాల పైన గాని, రాజ్యాంగం పైన గాని కనీస అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కావ్య ఎస్సీ కాదని మాట్లాడడం నీచమైన విషయం అన్నారు.

 

కృష్ణ మాదిగ విమర్శలు హాస్యాస్పదం

మంద కృష్ణ నా పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడని, అందుకు కారణం మంద కృష్ణ చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. మాదిగలకు ద్రోహం చేసింది నేను కాదు మంద కృష్ణ అంటూ విమర్శించారు. బీజేపీకి ముస్లిం, క్రిస్టియన్, దళితులంటే గిట్టదు… మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం… రిజర్వేషన్ ఎత్తివేస్తాం అంటున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావ్ అంటే మాదిగలకు ద్రోహం చేసినట్టు కాదా అన్నారు. ఈ రోజున ఏ రాజకీయ పార్టీ నిన్ను నమ్మే పరిస్థితి లేదని కృష్ణ మాదిగ నుద్దేశించి అన్నారు. ఈ విషయంలో మాదిగలు, దళితులు ఆలోచన చేయాలని కోరారు.

కుల, మతాల చిచ్చు పెట్టే కుట్ర: కడియం కావ్య

కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు తీసుకురావాలని బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న కుట్రలను ఈ రోజున వరంగల్లో అమలుచేయాలని ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. తనపై కులం, మతం పేరుతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వివాహము, తన కులము, ప్రాంతం పట్ల ఆరోపణలు చేయడం చూస్తే జాలేస్తుందన్నారు. నేను తెలంగాణ బిడ్డను. వరంగల్లోనే పుట్టాను. వరంగల్ లోనే పెరిగాను. ఇక్కడే చదివాను. ఇక్కడే నీ కళ్ళముందే వర్ధన్నపేట లోనే ఉద్యోగం చేశాను. రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ వారసురాలిని. నీ కళ్ళముందే పెరిగాను. ఇప్పుడు కొత్తగా రమేష్ కులం, మతాన్ని ముందుకు తీసుకురావడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు: రేవూరి

వరంగల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలవలేని పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ తన పాత బి ఆర్ ఎస్ ఆరోపణలనే చేస్తున్నారని విమర్శించారు. కావ్య కులాన్ని ఎత్తిచూపడం అంటే దిగజారి మాట్లాడమని మండిపడ్డారు. కావ్య గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా కృషి చేస్తుందని ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, పార్టీ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ తదితరలు పాల్గొన్నారు.

Latest News