విధాత: బీఆరెస్ నేతలు తొందరపడి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయవద్దని, ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరిద్దామని, ప్రజాతీర్పును గౌరవిద్దామని సొంత పార్టీ నేతలకు హితవు పలుకుతూ ఎల్బీనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెలుతున్నానంటూ వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. నేను బీఆరెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదని, పార్టీలో నాకు సముచిత స్థానం ఉందన్నారు.
ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ప్రతిపక్షంగా బీఆరెస్ నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సివుందని, కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు ప్రభుత్వానికి 6నెలల సమయమిచ్చి చూద్దామని, ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని, ప్రభుత్వంపై హామీల అమలుకు ఒత్తిడి తెద్దామనిడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సూచనలను పార్టీ నాయకత్వం అర్దం చేసుకుంటుందని, దీనిపై పెడర్ధాలు అవసరం లేదన్నారు.