విధాత: ఆంధ్రప్రదేశ్‌లో అధికార ప్రతిపక్షాలు తమ తమ ఏర్పాట్లు ముమ్మరం చేస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వైరిపక్షం మీద పైచేయి సాధించడానికి అన్ని అవకాశాలూ, అన్ని విధానాలూ అమలు చేస్తున్నాయి. రాబిన్ శర్మ వంటి రాజకేయ వ్యూహకర్త సలహాలతో చంద్రబాబు ఇప్పటికే ప్రజా క్షేత్రంలో దూకి పర్యటనలు మొదలు పెట్టగా జగన్ అయితే అంతర్గత సర్వేలు, ప్రశాంత్ కిషోర్ నివేదికలు, ఇంకా ప్రభుత్వ ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలతో లెక్కలు బేరీజు వేస్తున్నారు.
మెరిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లకే సీట్లు ఇస్తామని జగన్ చెప్పేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా సిద్ధం చేసారని, వాటి ఆధారంగా టికెట్స్ ఇస్తారని అంటున్నారు. దీంతో పరీక్షలు రాసి, ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థుల మాదిరి ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నరు.
ఎన్నికలకు ఏడాదిన్నర టైం ఉండగానే జగన్ పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను గడప గడపకు పంపించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అన్ని రకాలుగా సేకరించిన నివేదికలు పట్టుకుని పార్టీ మీటింగులో ఎవరికి వారికి అప్పగించడమే మిగిలింది అని అంటున్నారు. ఈ మధ్యనే విజయవాడలో బీసీ గర్జన నిర్వహించి ఆయావర్గాల మద్దతును కూడగట్టేందుకు గట్టి యత్నం చేశారు.
దీంతో ఇదే తీరున మరిన్ని సభలను ఏపీలో అంతటా నిర్వహిస్తారని అంటున్నారు. ఇదే తీరులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సభలు పెడతారని అంటున్నారు. ఈ నెల 14న ఏర్పాటు చేయబోయే పార్టీ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేల పనితీరు మీద సుదీర్ఘమైన చర్చ ఉంటుంది అని అంటున్నారు.
అందరూ తనకే కావాలి అని అనుకుంటున్నారు.. కానీ, గెలుపు గుర్రాలకే తాను టికెట్ ఇస్తానని జగన్ వివరించనున్నారు. ఇప్పటిదాకా చూస్తే 27 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని గుర్తించారు. మరి వారికి టికెట్ ఇస్తారో.. ఇవ్వరో.. ఎలా నచ్చజెబుతారో చూడాలి. అందుకే ఈ వర్కుషాప్ మీద ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.