- ముగిసిన రామచంద్ర పిళ్లై కస్టడీ
- ఏప్రిల్ 5 వరకు కస్టడీని పొడిగించిన కోర్టు
విధాత: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సుదీర్ఘంగా విచారిస్తున్నది. ఇదే కేసులో రామచంద్ర పిళ్లై (Arun Ramchandran Pillai)తో కలిసి కవితను కాన్‌ఫ్రంటేషన్ (ఇద్దరినీ ఒకే గదిలో కూర్చోపెట్టి) పద్ధతిలో విచారించారని సమాచారం.
పిళ్లై విచారణ ముగిసిన అనంతరం ఆయనను రౌస్‌ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది. అయితే.. పిళ్లైతో కాన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించిన అనంతరం కవిత విచారణ కొనసాగుతూనే ఉండటం గమనార్హం. సౌత్ గ్రూప్ (South Group)తో సంబంధాలు, ఆప్ (AAP) నేతలకు ముట్టిన వంద కోట్లు తదితర అంశాలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే ఒక విడత విచారణకు హాజరైన కవిత.. ఈ నెల 16న మరోదఫా విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. హాజరు కాలేదు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై సుప్రీంకోర్టులో (Supreme Court) తాను వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నదని, అది తేలే వరకు విచారణ వాయిదా వేయాలని ఈడీ అధికారులకు ఆమె లేఖ రాశారు.
అయితే.. ఆ వినతిని తిరస్కరించిన ఈడీ అధికారులు.. సోమవారం హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి తన భర్త అనిల్‌తో కలిసి కవిత చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కవిత తరఫు న్యాయవాది, బీఆర్‌ఎస్ నాయకుడు సోమ భరత్‌కుమార్ సైతం వచ్చారు.