గులాబీ జెండా.. కాషాయ ఎజెండా.. కవిత హిందూత్వను ఎందుకు ఎత్తుకున్నారు?

ఎమ్మెల్సీ కవిత తాజాగా హిందూత్వ, హిజాబ్‌ గురించి మాట్లాడుతున్నారు.

  • Publish Date - December 27, 2023 / 03:54 AM IST
  • నాడు కేసీఆరే నయమన్న అరవింద్‌
  • కాంగ్రెస్‌లో హిందూ డీఎన్‌ఏ లేదన్న కవిత
  • లౌకిక పార్టీ నేత నుంచి హిందూత్వ, హిజాబ్‌
  • బీఆరెస్‌ నేత మాటలపై విశ్లేషకుల్లో చర్చలు
  • మొన్నటిదాకా ‘రహస్య మైత్రి’ ముసుగు!
  • తమది లౌకిక పార్టీ అంటూ ఉద్ఘాటనలు
  • లోక్‌సభ పోరులో ముసుగు తొలగిస్తారా?
  • కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి కలుస్తాయా?
  • రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చలు

(విధాత ప్రత్యేకం)

నిన్న మొన్నటి వరకూ బీఆరెస్‌, బీజేపీది రహస్య మైత్రి అని అంతా భావించారు. అయితే తాము ఉప్పు నిప్పు లాంటివాళ్లమని రెండు పార్టీల నేతలూ వాదించుకున్నా.. వారి చర్యలు, వైఖరులతో జనం మాత్రం వారి వాదనలను విశ్వసించలేదు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల వరకూ త‌మది సెక్యుల‌ర్ పార్టీ, స‌బ్బండ వ‌ర్గాల పార్టీ అని చెప్పుకొన్న బీఆరెస్.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాషాయ పార్టీకి దగ్గరవుతున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటిదాకా ధరించిన ‘రహస్య మైత్రి’ ముసుగు నుంచి బయటకు వచ్చి.. డైరెక్టుగా చేయిచేయి కలిపే అవకాశాలు ఉంటాయా? అనే విషయంలో చర్చ నడుస్తున్నది. గతంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, తాజాగా బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు అర్వింద్‌.. రేవంత్‌రెడ్డికంటే కేసీఆరే నయమని వ్యాఖ్యానిస్తే.. ఇప్పుడు కవిత.. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే హిందూ వ్య‌తిరేక ధోర‌ణి ఉన్నదని చేసిన వ్యాఖ్య‌లను వారు ప్రస్తావిస్తున్నారు. శ‌త్రువుకు శ‌త్రువు త‌న‌కు మిత్రుడ‌న్న సూత్రాన్ని బీఆరెస్ అందిపుచ్చుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఇండియా కూట‌మిలో భాగ‌స్వామి అయిన డీఎంకే నేత ద‌యానిధి మార‌న్ చేసిన‌ వ్యాఖ్య‌లను ఖండించే స‌మ‌యంలో గులాబీ జెండా నేత క‌విత కాషాయ ఎజెండాతో మాట్లాడార‌న్న అభిప్రాయాన్ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియా కూట‌మిలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తమిళనాడు మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదన్నది కవిత ప్రశ్న. దానితోపాటే.. హిజాబ్ వివాదంపై రాహుల్ త‌న వైఖ‌రి చెప్పాల‌ని క‌విత డిమాండ్ చేశారు. అయితే.. నిజానికి డీఎంకే నేతలు హిందూత్వ అజెండాను ప్రశ్నించడం, ఖండించడం ఇదే మొదటిసారి కాదు. ఇదే చివరిసారి కూడా కాబోదు. కానీ.. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు డీఎంకే నేతల వ్యాఖ్యలను ఖండించాలన్న సోయి సడన్‌గా కవితకు ఎందుకు వచ్చిందన్నదే రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపింది.

మైత్రి ఆరోపణలకు బలం చేకూర్చిన పరిణామాలు

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీఆరెస్‌, బీజేపీకి మ‌ధ్య ర‌హ‌స్య అవ‌గాన ఉంద‌న్న ప్ర‌చారం బ‌లంగా జ‌రిగింది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీ మ‌ద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత‌ను అరెస్ట్ చేయ‌లేద‌న్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీఆరెస్, బీజేపీ మ‌ధ్య ఏదో ఉంద‌న్న ప్ర‌చారాన్ని బ‌ల‌ప‌రిచే తీరుగా కూడా బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం అనుస‌రించింది. కాంగ్రెస్‌కు ఆర్థికంగా స‌హ‌కారం అందించే అవ‌కాశం ఉన్న వ్యాపారులు, కాంగ్రెస్ నాయ‌కుల ఇండ్లు, వ్యాపార సంస్థ‌ల‌పైనే ప్ర‌త్యేకంగా ఐటీ సోదాలు కూడా జరిగాయి. ఈ ఐటి తనిఖీలు, ఆర్థిక దిగ్బంధం అంతా బీఆరెస్‌, బీజేపీ క‌లిసే చేస్తున్నాయ‌న్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ బీజేపీకి, త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని బీఆరెస్ అగ్ర‌నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావు చెబుతూ వ‌చ్చారు. కేసీఆర్ నేను కూడా హిందువునే కానీ మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేస్తారా? అని ప్ర‌శ్నించారు కూడా. నిజానికి రాష్ట్రంలో ఒక ద‌శ‌లో కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగు అవుతుంద‌ని కేసీఆర్ భావించారు. త‌న పోరాటం బీజేపీతోనే ఉంటుంద‌ని భావించి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూట‌మికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను అంతే దూరంగా ఉంచుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ త‌న‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేద‌ని అర్థం కావ‌డంతో మూడ‌వ ప్ర‌త్యామ్నాయం ఎజెండా ఎత్తుకున్నారు. బీజేపీ వ్య‌తిరేక పార్టీలేవీ కేసీఆర్‌ను విశ్వ‌సించ‌లేదు. దరి చేరనీయలేదు. అనంతరం రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న‌ది. దీంతో రాష్ట్రంలో బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోరనేది అర్థ‌మైంది. అందుకే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిస్తే క‌నీసం అభినంద‌లు కూడా తెలుప‌లేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్‌ పదేళ్ల అధికారానికి తెరదిగింది. అయితే.. కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా పుంజుకోవాలనే బలమైన ఆలోచనలతో బీఆరెస్‌ నాయకత్వం కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కవిత హిందూత్వ ఎజెండా ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

లోక్‌సభ పోరుకు వ్యూహరచనలు

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకున్నప్పటికీ ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రజలు భావించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు ఇంకో నాలుగు సీట్లు గెలుచుకోవాలన్నది బీజేపీ అధిష్ఠాన పెద్దల ఆదేశంగా చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 సీట్లు గెలుచుకోవడంతో పాటు 24 స్థానాల్లో 50 వేల కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. 63 చోట్ల 25 వేల వరకు ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ఈ లెక్కల ఆధారంగానే గతంలో గెలిచిన 4తో పాటు మరో 4 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నదని చెబుతున్నారు.

ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమిని దెబ్బతీయడమే లక్ష్యం!

బీఆరెస్‌ ఓడిపోయిన తర్వాత.. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువకాలం ఆ పార్టీలో ఉండరని, త్వరలోనే కారు ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతున్నది. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కర్ణాటకలో జేడీఎస్‌ తరహాలోనే బీజేపీకి దగ్గరవ్వాలనే యోచిస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారింది. ఆ పేరు ప్రకటన సమయంలో జేడీఎస్‌ నేత కుమారస్వామి హైదరాబాద్‌ వచ్చారు. ఆ సందర్భంలోనే కేసీఆర్‌ కర్ణాటకలో తాము జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అక్కడ పోటీ చేయపోగా, కనీసం జేడీఎస్‌కు ఓటు వేయాలని పిలుపు కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌ విస్తరణలో భాగంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వరకే పరిమితమైంది తప్పించి అక్కడ ఒక్క సభ కూడా నిర్వహించలేదు. కానీ మహారాష్ట్రలో చాలా సభలు పెట్టింది. ఒడిశాలోనూ పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాఢీని దెబ్బతీసేందుకు అక్కడ బీఆర్‌ఎస్‌ పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట, ఒడిశాలోనూ బీజూ జనతాదళ్‌ బలంగా ఉన్నచోట బీఆరెస్‌ పోటీ చేసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టేందుకు?

తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ 9 సీట్లు గెలుకోగా 41. 29 శాతం ఓట్లు వచ్చాయి. 17 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్‌కు 29.48 శాతం ఓట్లు వచ్చినా 3 చోట్లనే గెలువగా.. బీజేపీ 19.45 శాతం ఓట్లతో 4 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. ఈ గణాంకాలను గమనిస్తే.. ఎవరి పోటీ ఎవరికి లాభించిందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకున్నబీఆర్‌ఎస్‌ ఈసారి తిరిగి ఆ సీట్లను దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నది. అయితే అధికారం కోల్పోయినందున ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి పరోక్షంగా బీజేపీ సహకారం అవసరమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి.. మరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్‌ను నిలువరించడం బీజేపీ ప్లాన్‌గా చెబుతున్నారు. అయితే.. ఇప్పటికీ రహస్య మైత్రితోనే మంత్రాంగం నడుస్తుందా? బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకదానికొకటి పరోక్షంగా సహకరించుకుంటాయా? లేక ముసుగు తీసేసి.. ఇద్దరం ఒకే టీం అని చాటుకుంటారా? వేచిచూడాలి.