Karimnagar PADI KAUSHIK REDDY
విధాత బ్యూరో, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అంటూ అటు శాసనమండలి సభ్యునిగా, ప్రభుత్వ విప్ గా జాక్ పాట్ కొట్టేసిన పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసు అధికార పార్టీని ప్రతిసారి చిక్కుల్లో పడేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతు దినోత్సవాలు నిర్వహించింది.
హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆబాది జమ్మికుంటలో నష్టపోయిన పంటలకు పరిహారం గురించి ప్రశ్నించిన ఓ రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నీకు సిగ్గు శరం ఉందా’ అంటూ నోరు జారారు.
దీంతో ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించే క్రమంలో బుర్ర కుమార్ అనే రైతు ఆయనను అడ్డుకున్నారు.
ఇటీవలి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పదివేల పరిహారం ఇస్తామన్న హామీ ఎటు పోయిందని నిలదీశారు.
పది రోజుల్లో పరిహారం అందజేస్తాం అన్నారు… మూడు నెలలు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయిందని ఆయన రైతుల ఆవేదనను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. రుణ మాఫీ అన్నారు.. అది ఎక్కడ అమలు జరిగిందని ప్రశ్నించారు.
దీంతో సదరు రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకున్న భూమి ఎంత అని ప్రశ్నించారు. సమాధానంగా సదరు రైతు తనకు మూడు ఎకరాల భూమి ఉందని సమాధానం ఇచ్చారు.
ఆ భూమికి రైతుబంధు తీసుకుంటలేవా అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ సదరు రైతును కూర్చో అంటూ హెచ్చరిక స్వరంతో సూచించారు. నీకు సిగ్గు శరం ఉందా, పింఛన్ తీసుకోవడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.