-అదానీకి మేలు చేసేందుకు నేరుగా జోక్యం చేసుకున్నారా!
-ఏం జరిగిందో చెప్పాలంటూ విదేశాంగ శాఖ మంత్రికి టీఎంసీ ఎంపీ వరుస లేఖలు
విధాత: గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హస్తంపై రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. అదానీ గ్రూప్‌కు బంగ్లాదేశ్ పవర్ డీల్ రావడంలో మోదీ జోక్యం చేసుకున్నారా? అంటూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారిప్పుడు.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కు సిర్కర్ ఈ విషయమై ఇప్పటిదాకా మూడుసార్లు లేఖలు రాశారు. అదానీ-బంగ్లాదేశ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై ఆ దేశ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు, భారతీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థల అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో ఈ లేఖలను సిర్కర్ రాశారు.
డిసెంబర్ 13 నుంచి..
నిరుడు డిసెంబర్ 13న విదేశాంగ మంత్రి జయశంకర్‌కు తొలిసారి లేఖ రాసిన సిర్కర్.. గత నెల 31న రెండోసారి, ఈ నెల 13న మూడోసారి లేఖలు రాశారు. వీటికి స్పందించకపోతే ఈ అంశంపై ప్రజల్లోకే వెళ్తానని ఆయన అంటున్నారు. ఈ రకమైన అక్రమ, ఏకపక్ష ఒప్పందాలతో బంగ్లాదేశ్‌లో భారత్ పరువు పోగలదని, మన దేశంపై వ్యతిరేకతకూ దారితీయవచ్చని సిర్కర్ అంటున్నారు.
2015 జూన్‌లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మోదీ పర్యటించినప్పుడు అదానీ పవర్ డీల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సిర్కర్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తర్వాతి కాలంలో జార్ఖండ్‌లోని అదానీ గ్రూప్ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్ విద్యుత్తు కొనేలా 4.5 బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందని చెప్తున్నారు. అయితే ఇది పూర్తి ఏకపక్షంగా ఉందని బంగ్లాదేశ్ అంటున్నది.
దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి..
నిజానికి బంగ్లాదేశ్ ఓ మిగులు విద్యుదుత్పత్తి దేశం. అవసరాల కంటే 40 శాతం ఎక్కువే అక్కడ విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. అయినప్పటికీ అదానీకి లాభం చేకూర్చేందుకు భారత్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోదీ ఈ డీల్‌ను కుదిర్చారన్న ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు (బీపీడీబీ) సైతం అదానీతో 2017లో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో సవరణలు చేయాలని ఇటీవల డిమాండ్ చేసింది.
అదానీ ప్లాంట్‌లో ఉత్పత్తి జరిగినా.. లేకపోయినా ఒప్పంద కాలంలో ఏటా దాదాపు 450 మిలియన్ డాలర్లు సామర్థ్యం, నిర్వహణ చార్జీల పేరిట బంగ్లాదేశ్ చెల్లించాలని డీల్‌లో ఉండటంపై బీపీడీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. మొత్తానికి అదానీ వ్యవహారం.. మోదీ మెడకు గట్టిగా చుట్టుకుంటున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయిప్పుడు.