Site icon vidhaatha

MODI | ఇస్రోలో మోదీ వన్‌మ్యాన్‌ షో! కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు నో ఎంట్రీ

MODI |

న్యూఢిల్లీ: ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు శనివారం ఉదయం బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనను వన్‌ మ్యాన్‌ షోలా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఈ నెల 23న విజయవంతంగా చంద్రునిపై కాలుమోపిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునేందుకు స్వయంగా వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గానీ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గానీ విమానాశ్రయానికి రాలేదు.

ఈ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని కాంగ్రెస్‌ మండిపడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేత జైరాంరమేశ్‌ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేస్తూ.. ‘ప్రధాని వైఖరిని దుయ్యబట్టారు. తనకంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం, డిప్యూటీ సీఎం ముందే వెళ్లి కలవడంపై మోదీ నారాజ్‌ అయ్యారేమో.

ఇస్రో శాస్త్రవేత్తలను గౌరవించే సందర్భంలో వాళ్లు తన ముందు ఉండటం ఇబ్బందికరంగా అనిపించి ఉండొచ్చు. అందుకే ఉధ్దేశపూర్వకంగానే వారిని విమానాశ్రయానికి రానీయలేదు. ఇది ప్రొటోకాల్ అతిక్రమణే’ అని పేర్కొన్నారు. ఇది దివాలాకోరు రాజకీయ అయిష్టత అని అన్నారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 2008 అక్టోబర్‌ 22న చంద్రయాన్‌ విజయవంతం అయినప్పుడు అప్పటికి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ.. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ను సందర్శించిన విషయాన్ని మోదీ మోర్చిపోయారా? అని ప్రశ్నించారు. అయితే.. సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం నిరాకరించడాన్ని ప్రధాని ఇస్రోలో చేసిన ప్రసంగంలో సమర్థించుకున్నారు.

తాను ఎప్పుడు బెంగళూరు చేరతానో తెలియదని, అందుకే వారిని పొద్దున్నే ఇబ్బంది పెట్టడం ఎందుకనే పిలవలేదని చెప్పారు. అయితే.. ఇస్రోలో కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంను పిలవకపోవడం మొత్తం కర్ణాటక ప్రజానీకాన్ని అవమానించడమేనని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

Exit mobile version