క‌ష్టాలే కొన్ని పాఠాలు నేర్పుతాయి.. రుజువు చేసిన థాయ్‌ల్యాండ్ కోతులు

నారు పోసిన వాడే నీరు పోస్తాడ‌ని మ‌న ద‌గ్గ‌ర వినిపించే సామెత‌. జీవితం దానిక‌దే ముందుకు వెళిపోతుంది అన్న‌ది పాశ్చాత్య త‌త్వ‌వేత్త‌లు చెప్పిన మాట‌

  • Publish Date - December 27, 2023 / 11:06 AM IST

విధాత‌: నారు పోసిన వాడే నీరు పోస్తాడ‌ని మ‌న ద‌గ్గ‌ర వినిపించే సామెత‌. జీవితం దానిక‌దే ముందుకు వెళిపోతుంది అన్న‌ది పాశ్చాత్య త‌త్వ‌వేత్త‌లు చెప్పిన మాట‌. అంటే ఏదైనా ఒక‌టి లేక‌పోతే ఇక జీవితం అయిపోయిన‌ట్లు కాద‌ని.. బ‌తికుంటే అదే ముందుకు వెళిపోతుంద‌ని అర్థం. ఇలాంటి భావ‌న‌ను బ‌ల‌ప‌రిచే ఘ‌ట‌న కోతుల ద్వారా మ‌రోసారి నిరూపిత‌మైంది. థాయ్‌ల్యాండ్‌ (Thailand) లోని ప‌టాయాకు ద‌గ్గ‌ర్లో కోహ్ పాడ్ అనే దీవి ఉంటుంది.


ఇందులో పొడ‌వైన తోకతో ఉండే మ‌కాక్స్ కోతులు (Monkeys) విరివిగా ఉంటాయి. వీటి ద‌గ్గ‌ర‌కు సంద‌ర్శ‌కులు క్యూ క‌డుతూ ఉంటారు. వారు అర‌టి ప‌ళ్లు, మామిడి ప‌ళ్లు వంటివి ఇస్తూ ఉండ‌టంతో ఈ కోతుల‌కు ఆహారం సంపాదించుకోవాల్సిన అవ‌స‌రం ఎప్పుడూ లేకుండా పోయింది. ఎప్పుడైతే కొవిడ్ మ‌హమ్మారి వ‌చ్చిందో లాక్‌డౌన్‌ల కార‌ణంగా ప‌ర్యాట‌కుల‌ను ఈ దీవిలోకి నిషేధించారు. దీంతో ఆ కోతుల‌కు ఆహారం అంద‌కుండా పోయింది.


క‌ట్ చేస్తే గ‌తేడాది కొంద‌రు ప‌రిశోధ‌కులు కొవిడ్ వ‌ల్ల ఈ కోతుల‌పై ఏమైనా ప్ర‌భావం ప‌డిందా అని ప‌రిశీలించేందుకు ఆ దీవిలోకి వెళ్లి అధ్య‌య‌నం చేశారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా అక్క‌డున్న కోతులు.. ఆహారం కోసం అవి సంద‌ర్శ‌కుల‌పై ఆధార‌ప‌డ‌కుండా రాళ్లు, క‌ర్ర‌లతో చెట్లపై పళ్ల‌ను కోసుకుని తింటుండ‌టాన్ని గ‌మ‌నించారు. అయితే కొవిడ్ ముందెప్పుడూ అవి ఇలా ప్ర‌వ‌ర్తించిన దాఖ‌లాలు లేవు.. ఇంకా చెప్పాలంటే వాటికి ఆహారం సంపాదించుకోవాల‌న్ని జ్ఞానం కూడా ఉండి ఉండ‌ద‌ని పరిశోధ‌కులు పేర్కొన్నారు.


కొవిడ్ కాలంలో ఆహారం ఇచ్చేవారు లేక‌పోవ‌డంతో.. ఆక‌లిని గెల‌వ‌డానికి ఈ విద్య నేర్చుకున్నాయ‌ని తెలిపారు. జీవితం వాటికి ఒక విద్య‌ను నేర్పింద‌ని… ఉనికి కోసం ప‌డే త‌ప‌నే కొత్త దారిని చూపిస్తుంద‌ని మ‌రో సారి రుజువైంద‌ని వారు చెప్పుకొచ్చారు. ‘కొన్ని కొన్ని కోతులు క‌ర్ర‌ల‌ను భ‌లే నేర్పరిత‌నంతో ఉప‌యోగిస్తున్నాయి. ఒక‌టి రెండు కాదు స‌మూహంలో అన్ని కోతులూ ఇందులో ఆరితేరాయి.


గింజ‌ల‌ను, కొబ్బ‌రి కాయ‌ల‌పై పీచును తీయ‌డానికి ప‌దునైన రాళ్ల‌ను ఎంచుకుని ఒలుచుకుని తింటున్నాయి. మ‌రికొన్ని కొబ్బ‌రికాయ‌ను కింద పెట్టి.. ఒక మాదిరి రాయి దానిపైన ప‌దే ప‌దే ప‌డేస్తున్నాయి. ప‌గిలాక గుజ్జును తింటున్నాయి’ అని జ‌ర్మ‌నీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎవ‌ల్యూష‌న‌రీ ఆంథ్రోపాల‌జీ శాస్త్రవేత్త‌లు తెలిపారు. ఈ అధ్య‌య‌నం (Study) వివ‌రాలు ఇటీవ‌లే సైన్స్ అడ్వాన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

Latest News