Site icon vidhaatha

రాజగోపాల్‌కు ఓటేయండి.. నేను చూసుకుంటా.. MP కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆడియో లీక్‌

విధాత: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వ్య‌వ‌హారం త‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి వివాదాస్ప‌దం అవుతున్న‌ది. త‌న ఆలోచ‌న‌లు, త‌న అన్న ఆలోచ‌న‌లు ఒకటే అని రాజ‌గోపాల్ అంటే ఓ టీవీ ఛాన‌ల్‌లో మీరు ఎవ‌రి ప‌క్షాన ప‌నిచేస్తార‌ని అడిగితే మీ త‌మ్ముడో, అక్కో ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే మీరు ఏం చేస్తారో నేను అదే చేస్తాన‌ని చెప్పి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. మంత్రి కేటీఆర్‌, ఇత‌ర టీఆర్ఎస్ మంత్రులు వెంక‌ట్ రెడ్డి కోవ‌ర్ట్ రాజ‌కీయాలు చేస్తున్నారని విమ‌ర్శిస్తే ఖండించారు.

అయితే త‌న పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రుతున్న‌ది.. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయ‌న ప్ర‌చారానికి ఎందుకు వెళ్ల‌డం లేదంటే నాలాంటి హోంగార్డులు పార్టీకి అవ‌స‌రం లేద‌ని వ్యంగ్య స‌మాధానాలు ఇచ్చి దాట‌ వేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అంద‌రూ మొద‌టి నుంచి ఆరోపిస్తున్న‌ట్ట‌గానే వెంక‌ట్‌రెడ్డి త‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి గెలుపు కోసం తెర వెనుక ప‌ని చేస్తున్నార‌ని తేట‌తెల్ల‌మైంది.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2022/10/komati-1.mp4

కోమటిరెడ్డి ఫోన్‌ సంభాషణ

మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి త‌న త‌మ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ చేసిన‌ట్టు ఒక ఆడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఓ కాంగ్రెస్ లీడర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మునుగోడులో బీజేపీ గెలిస్తే నాకే పీసీసీ ప‌ద‌వి వ‌స్తుంద‌ని, త‌ర్వాత మన‌మే ప్ర‌భుత్వాన్ని తీసుకొద్దాం. ఆ త‌ర్వాత ఏమైనా ప‌నులు ఉంటే చూసుకుందాం. చచ్చినా బతికిన రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తూ ఉంటారు. కాబ‌ట్టి ప్ర‌స్తుతం పార్టీల‌కు అతీతంగా రాజ‌గోపాల్ గెలుపు కోసం ప‌నిచేయాల‌న్న‌ది ఆ సంభాష‌ణ సారాంశం.

ఇదిలాఉండగా ఈ నెల 23న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ఎంట‌ర్ కానున్న‌ది. రాహుల్ 12 రోజుల పాటు తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఒక‌వైపు రాహుల్ పాద యాత్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయ‌డానికి, ఆ పాద యాత్ర విజ‌య‌వంతం కావ‌డానికి స‌మాలోచ‌న‌లు చేస్తూనే.. మునుగోడులో కాంగ్రెస్ స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

ఈ సీటును నిల‌బెట్టుకుని ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మ‌రోసారి రుజువు చేస్తామ‌ని నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కృషి చేస్తున్నారు. కానీ వెంక‌ట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూ.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. ప్ర‌చారానికి దూరంగా ఉంటూ కాషాయ పార్టీ గెలుపు కోసం కోవ‌ర్టు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లే కాదు సొంత పార్టీ నేత‌ల ఆరోప‌ణ‌లు నిజ‌మే అన్న‌ది ఇవాళ స్ప‌ష్ట‌మైంది అంటున్నారు. ఆయ‌న వైఖ‌రిపై మండి ప‌డుతున్నారు.

Exit mobile version