Naga Shaurya
విధాత: చాలా రహస్యంగా ఉంచాల్సిన వాటిని.. అనుకోకుండా నోరు జారడం.. రివీల్ చేయకూడదని చెప్పినా మైక్ ముందు లీక్ చేయడం.. ఆ తర్వాత నాలిక్కరుచుకోవడం సినీ జనాలకు మామూలే. అలా నోరు జారారని తెలిస్తే అది సినిమాకు ఫ్లస్ అయిన సందర్భాలు, మైనస్ అయిన సందర్భాలు రెండూ ఉన్నాయి.
దీనికి మెగాస్టార్ చిరంజీవినే ఉదాహరణగా తీసుకోవచ్చు. ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నోరు జారి సినిమాలో ట్విస్ట్ ముందుగానే చెప్పేశాడు. ఆ తర్వాత అయ్యో అనుకున్నా కథలోని సత్తావల్ల సినిమా బంపర్ హిట్ అయింది. ఆ వీడియోపై అప్పట్లో మీడియాలో రచ్చలేచింది.
ఆ తర్వాత చిరంజీవి ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కనిపించినా, ప్రసంగించినా ఏదో లిక్ చేసేస్తాడని దర్శకులు భయపడిన సందర్భాలున్నాయి. ఇదంతా ఎందుకులే అనుకుని.. ఈ మధ్య చిరంజీవే ‘చిరు లీక్స్’ అంటూ.. తను చేస్తున్న సినిమాకు సంబంధించిన రహస్యాలను రివీల్ చేసేస్తున్నారు.
ఇక విషయంలోకి వస్తే.. ఈ యంగ్ హీరోతో కాన్ఫిడెన్స్ అనుకోవాలో.. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో తెలియదు కానీ.. యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న వ్యాఖ్యలైతే విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో వాళ్ళ సినిమా తోపని, తురుమని చెప్పుకోవడం సినిమా వాళ్లకి మాములే. కాకపోతే నాగశౌర్య ఈ లెవల్ దాటి మరీ కామెంట్ చేయడం ఇప్పుడు చర్చయ్యి, పెద్ద రచ్చకు తెరతీసింది.
గతంలోనూ నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు దుమారం లేపితే ఇప్పుడు అవి తారా స్థాయిలో చేరాయి. నాగశౌర్య తాజాగా నటించిన సినిమా ‘రంగబలి’. జూలై 7న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. రంగబలి యావరేజ్, హిట్ స్థాయి దాటి బ్లాక్‌బాస్టర్ అయ్యే సినిమా అని చెబుతూ నాగశౌర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకూ తను నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ‘రంగబలి’ మరో ఎత్తని.. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లోకీ ‘రంగబలి’ సినిమా గొప్ప లాభాలను తెచ్చి పెట్టే సత్తా ఉన్న సినిమా అని విడుదలకు ముందే కితాబిచ్చేస్తున్నాడు.
గతంలోనూ ఇలాగే నోరుజారి అక్షింతలు వేయించుకున్న నాగశౌర్య ధోరణిలో మార్పు రాలేదని ఆయన కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. మరీ ఇంతలా ఉండకూడదు. అదే సినిమా విడుదలై.. మంచి హిట్ కొట్టాక.. ఇలాంటి మాటలు చెబితే నమ్ముతారు కానీ.. ముందే ఇలా చెప్పడం శౌర్య అతికి అర్థంగా అనిపిస్తోంది.
ఒకవేళ ఆయన చెప్పినట్లే ఆలోచిస్తే.. ఇంతకు ముందు సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ సినిమా కలెక్షన్స్ 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు నాగశౌర్య చెబుతున్న అంచనా ప్రకారం ‘రంగబలి’ దానిని దాటి కలెక్షన్స్ తెచ్చిపెట్టాలి. కథలో దమ్ముంటే సినిమా అదే హిట్ కొట్టి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది.. కానీ ఇలా మైక్ ముందు నోటికొచ్చింది వాగేస్తే ఎలాగని నాగశౌర్యను నెటిజన్లు ఆడుకుంటున్నారు.