అంగార‌కుడిపై 1000 రోజుల ప్ర‌యాణం పూర్తి చేసుకున్న ప‌ర్సెవ‌రెన్స్‌

అంగార‌కుడిపై ప‌రిశోధ‌న‌ల కోసం నాసా పంపిన ప‌ర్సెవ‌రెన్స్ రోవ‌ర్ అద్భుతం సృష్టించింది. అది మార్స్ ఉప‌రిత‌లంపై అడుగుపెట్టి 1000 మార్స్ రోజులు పూర్తి చేసుకుంది.

  • Publish Date - December 14, 2023 / 09:28 AM IST

అంగార‌కుడి (Mars) పై ప‌రిశోధ‌న‌ల కోసం నాసా (NASA) పంపిన ప‌ర్సెవ‌రెన్స్ (Perseverance) రోవ‌ర్ అద్భుతం సృష్టించింది. అది మార్స్ ఉప‌రిత‌లంపై అడుగుపెట్టి ఇటీవ‌లే 1000 మార్స్ రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నాసా ఒక స‌మావేశం చేసి ప‌రిశోధ‌న వివ‌రాల‌ను అందించింది. మిష‌న్ ఉద్దేశాన్ని ప‌ర్సెవ‌రెన్స్ రోవ‌ర్ 100 శాతం చేరుకుంద‌ని వెల్ల‌డించింది.


అంగార‌కుడిపై ఉన్న జ‌జేరో అనే బిలాన్ని ప‌రిశోధించ‌డానికి 2021 ఫిబ్ర‌వ‌రిలో ప‌ర్సెవ‌రెన్స్ ను నాసా ప్ర‌యోగించింది. ఇందులో ఉండే రోబో వంటి ప‌రిక‌రం.. ఆ బిలం చుట్టు ప‌క్క‌ల ప‌లు రాళ్ల‌ను, మ‌ట్టిని సేక‌రించి వాటిపై ప్ర‌యోగాలు చేసింది. ఆ వివరాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శాస్త్రవేత్త‌లతో పంచుకుంది. 1000వ మార్స్ రోజును పుర‌స్క‌రించుకుని ఆరుకాళ్ల నాసా సైంటిస్ట్ ప‌ర్సెవ‌రెన్స్‌కు ధ‌న్య‌వాదాలు. వంద‌ల కోట్ల ఏళ్ల నాటి జెజెరో బిలాన్ని శోధిస్తూ 23 న‌మూనాల‌ను సేక‌రించింది.


అంగార‌కుడు ఏర్ప‌డిన ద‌శ‌ను అర్థం చేసుకోవ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి అని నాసా త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక ప‌ర్సెవ‌రెన్స్‌ను స్విచాఫ్ చేసేస్తామ‌న్న వార్త‌లో నిజం లేద‌ని తెలిపింది. అయితే అది సేక‌రించిన న‌మూనాల‌ను భూమిపైకి ఎలా తేవాల‌న్న‌దానిపై నాసా శాస్త్రవేత్త‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సాంకేతికంగా ఉన్న మార్గాల‌ను, వ్య‌యంపై త్వ‌ర‌లోనే ఒక అవ‌గాహ‌న‌కు రానుంది.


కాగా ప‌ర్సెవ‌రెన్స్ ప‌రిశోధించిన జ‌జెరో బిలం.. ఒక‌ప్పుడు న‌దీ మార్గంలో ఉండి జీవ‌జాలానికి ఆయువుప‌ట్టుగా ఉండేది. ఇక్క‌డ జీవ‌జాలం ఉనికి ఉండేదా లేదా అనే దానిపై అనుమానాలు ఉన్న‌ప్ప‌టికీ.. అనువైన ప‌రిస్థితులు ఉన్న‌ట్లు సాక్ష్యాధారాలున్నాయి. త‌ర్వాతి కాలంలో అక్క‌డ ఏం జ‌రిగింది, మార్స్ ఎందుకు ఎడారిలా మారిందనే విష‌యాల‌కు ప‌ర్సెవ‌రెన్స్ సేక‌రించిన నమూనాలే స‌మాధానం చెబుతాయ‌ని నాసా ఆశ‌లు పెట్టుకుంది.

Latest News