అంతరిక్షం (Space) లో సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఓరియాన్ (Orion Space Craft) అనే రాకెట్‌ను నాసా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆర్టిమిస్ 1 మిషన్‌లో భాగంగా అది గతేడాది అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమి మీదకు చేరుకుంది. అది తిరిగొచ్చిన రోజు డిసెంబరు 11 కాగా ఈ రోజుకు ఏడాది పూర్తవడంతో ఆ వీడియోను నాసా పంచుకుంది. ఇందులో ఓరియాన్ రాకెట్.. ధ్వని కంటే 32 రెట్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నట్లు కనపడుతోంది.
కాగా.. 2022 నవంబరు 16న నాసా (NASA) స్పేస్ లాంచ్ సిస్టమ్ దీనిని లాంచ్ చేయగా.. డిసెంబరు 11న భూమి మీదకు వస్తున్న క్రమంలో అందులోని కెమేరాలు ఈ అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించాయి. ఈ ప్రయోగంలో భాగంగా మొత్తం 25 రోజుల పాటు ఇది అంతరిక్షంలో ప్రయాణం చేసింది. ఇందులో ఆరు రోజులు చందమామ చుట్టూ చక్కర్లు కొట్టింది. అంతే కాకుండా భూమికి 4,34,000 కి.మీ. దూరం వరకు ప్రయాణించింది. తద్వారా మానవుడు తయారుచేసిన రాకెట్‌లలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన రాకెట్‌గా రికార్డు సృష్టించింది. ఈ మొత్తం ప్రయాణంలో అది గంటకు 40 వేల కి.మీ. వేగాన్ని అందుకుంది.
అంతే కాకుండా దీని ల్యాండింగ్ విధానం కూడా అత్యంత ఆధునికమైనది. ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించినప్పటికీ.. అందులో ఉన్న వారు కావాల్సిన చోట ల్యాండ్ అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిని శాస్త్రవేత్తలు స్కిప్ ఎంట్రీ అని పిలుస్తున్నారు. ఆర్టెమిస్‌లో భాగంగా వ్యోమగాములు ఓరియాన్‌లో ప్రయాణం చేస్తారు. వారు తిరిగి వచ్చేటప్పుడు ల్యాండ్ అయ్యే ప్రాంతం నిర్దిష్టంగా ఉండటం అవసరం. అప్పుడే వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకురాగలం అని నాసా వెల్లడించింది. కాగా 2024 నవంబరులో ఆర్టిమిస్ 2లో భాగంగా ఓరియాన్ రాకెట్ వ్యోమగాములను చంద్రుని వద్దకు తీసుకెళ్లనుంది.