దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

విధాత, హైద్రాబాద్ బ్యూరో : ఎన్‌ఐఏ దేశ వ్యాప్తంగా బుధవారం 50ప్రాంతాల్లో సోదాలకు, దాడులకు దిగింది. ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదుల గాలింపును ఎన్ఐఏ వేగవంతం చేసింది.పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాలలో సోదాలు, దాడులు ముమ్మరం చేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలోభారత్ ప్రమేయం వుందంటూ కెనడా ఆరోపించిన తర్వాతా కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు తమ కార్యకలాపాల్లో వేగం పెంచాయి.



పంజాబ్ లోని 30చోట్ల, రాజస్థాన్ లోని 13 ప్రాంతాల్లో, హర్యానా లోని నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం. దాడుల్లో ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం ఎన్ఐఏ కు అందినట్టు సమాచారం. విదేశాలనుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాదులకు అందుతున్న నిధుల సాయం, ఆయుధాల సరఫరాకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకు అందినట్టు తెలిసింది.


ఉగ్ర ముఠాలు, కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, ఆయుధాల స్మగ్లింగ్, దోపిడీ,హత్యలు, ప్రభుత్వ భవనాలపై దాడులు వంటి చర్యలు చేపడుతున్నట్టు ఎన్ఐఏకి సమాచారం అందింది. దీంతో ఆయా ముఠాలను ఏరిపారేయడానికి ఎన్‌ఐఏ ఈ సోదాలు చేపట్టింది.