Nizamabad | కాంగ్రెస్ మనసులో ఉన్న మాటనే రేవంత్ బయట పెట్టాడు: మంత్రి వేముల

Nizamabad ఛత్తీస్ ఘడ్ లో మిగులు విద్యుత్ ఉన్న.. రైతులకు ఇస్తున్నది 8 గంటలే.. ఎంపి అరవింద్ మాటలు నమ్మే ఒకసారి మోస పోయాం అరవింద్ ఆరోపణలు అర్థరహితం.. వేల్పూర్ రైతు వేదిక నిరసన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విధాత‌, నిజామాబాద్‌: తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన […]

  • Publish Date - July 17, 2023 / 01:58 PM IST

Nizamabad

  • ఛత్తీస్ ఘడ్ లో మిగులు విద్యుత్ ఉన్న.. రైతులకు ఇస్తున్నది 8 గంటలే..
  • ఎంపి అరవింద్ మాటలు నమ్మే ఒకసారి మోస పోయాం
  • అరవింద్ ఆరోపణలు అర్థరహితం..
  • వేల్పూర్ రైతు వేదిక నిరసన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

విధాత‌, నిజామాబాద్‌: తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు రైతు వేదిక వద్ద జరిగిన నిరసన సభ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో రైతులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఎకరం పారడానికి ఒక గంట చాలు.. 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అని రేవంత్ రెడ్డి మాట్లాడడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండించారు. ఈ సందర్బంగా రైతులు గతంలో కరెంట్ కష్టాలతో పడ్డ తమ అనుభవాలను పంచుకున్నారు.

వేల్పూర్ రైతు చిన్నారెడ్డి మాట్లాడుతూ… అమెరికాలో ప్రశ్న అడిగిన వారే.. గంటకు ఎకరం ఎట్లా పారుతదని రేవంత్ రెడ్డిని ఒక్కటి పీకాల్సింది. మన మేమైన జర్మనీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నమా అని అడ‌గాల్సి ఉండే అని ధ్వ‌జ‌మెత్తారు.

రైతు సత్య గంగయ్య మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న. 4 గంటల్లో కూడా ఎకరం పారదు. గతంలో కాంగ్రెస్ పొద్దున, మధ్యాహ్నాం, రాత్రి రెండు గంటల చొప్పున కరెంట్ ఇచ్చేది, పంటలు ఎండి పోయేవి. ఇప్పుడు కేసిఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నడు, పంటలు మంచిగ పండుతున్నాయి. 24 గంటల ఉచిత కరెంట్ వద్దు అంటున్న రేవంత్ రెడ్డి “పాము కాటు వేయించుకొని” వద్దు అని మాట్లాడాలి. రానున్న రోజుల్లో రైతు వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లుమనిపిస్తాం అని అన్నారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యల వీడియో మంత్రి రైతులకు చూపించారు. అనంతరం నిరసన సభలో మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.. “పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాము అధికారం లోకి వస్తే ఏం చేయబోతున్నరో చెప్పాడు. రేవంత్ బలుపుతో 24 గంటల కరెంట్ అవసరం లేదు అని ఎలా అంటాడు. ఉచిత కరెంట్ ఇస్తే రేవంత్ కు ఏంనష్టం కాంగ్రెస్ కు ఏం నష్టం అని ప్ర‌శ్నించారు.

ఇంకా కాంగ్రెస్ పార్టీ దురహంకార వైఖరి పోలేదు. 24 గంటల కరెంట్ తో సంతోషం గా ఉంటె నీకు , నీ పార్టీకి ఎందుకు కడుపు మంట అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీ అబ్బా సొత్త కరెంట్ , బిచ్చమేస్తున్నావా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి కి కడుపు లో ఎంత విషముందో రైతులు గమనించాల‌ని సూచించారు.

కిరణ్ కుమార్ రెడ్డి శాపం పెట్టిండు… చిమ్మ చీకట్లో ఉంటారు అని విషం కక్కిండు. అప్పుడు జానారెడ్డి కూడా అసెంబ్లీ లో వ్యతిరేకించారు. ఇది యాక్సిడెంటల్ గా మాట్లాడింది కాదు. మనసు లో ఉన్నదే వచ్చింది బయటకు. ఛత్తీస్గఢ్ లో 8 గంటల కరెంట్ మాత్రమే ఇస్తది… వాళ్లు మిగుల్చుకోని అమ్ముకుంటారు. అది మనమే కొంటున్నాం… అక్కడ కొని ఇక్కడ రైతులకు ఇస్తున్నాం అని తెలిపారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి జాతీయ విధానం ఉండదా..? నేను రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నిస్తున్న.. అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇస్తారా .? కేసీఆర్ నీలాగా గోడలకు పెయింట్స్ వేయలేదు. ఆర్టీఏ అప్లికేషన్లు పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రి అయితే ఇక అధమ పాతాళానికే. సీఎం ఛత్తీస్ ఘడ్ నుండి కొనే కరెంట్ విషయం లో ప్రవైట్ ఇవ్వమని పట్టుదల గా ఉండే. ఎన్నో ప్రవైట్ కంపెనీలు వచ్చిన కూడా నేరుగా ప్రభుత్వం నుండే కొన్నారని తెలిపారు.

ఛత్తీస్ ఘడ్ నుండి కరెంట్ తెచ్చుకునేందుకు లైన్లు కూడా లేవు. 60 సంవత్సరాల కాంగ్రెస్ లో కనీసం లైన్లు కూడా వేసుకోలేదు. 4500 మెగావాట్ల ఉన్న తెలంగాణ 18 వేలా మెగావాట్ల ఉత్పాదన ఏర్పాటు చేసుకున్నాం. 80వేలా కోట్లతో పూర్తయిన కాళేశ్వరానికి లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఎంత సిగ్గు చేటు బీజేపీ నేతలది. బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని,కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడుతున్నారు. రైతులు ఆలోచన చేయాలి. మోస పోతే గోస పడతాం.” అని అన్నారు.

ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ఫైర్

“అరవింద్ పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి మోసం చేసి ఎంపి అయ్యాడ‌ని అన్నారు. రైతులను మోసం చేసి దర్జాగా తిరుగుతూ.. కష్టపడుతున్న మా లాంటి వాళ్లపై ఇష్టం వచ్చినట్లు అచ్చోసిన ఆంబోతు వలె ఒర్లుతున్నాడ‌ని ఆగ్ర‌హం వెలిబుచ్చారు. నాలుగున్నరేళ్ల లో తప్పు చేయని ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు చేస్తాడా. ఇప్ప్పుడే ఎన్నికల ముందు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎంపీకి కనీస అవగాహన లేదు. డబుల్ బిల్ తీసుకునే అవకాశమే లేదు అది సాధ్యం కాదు కానీ ఆరోపణ చేసిండు. నిధులు అస్సలే మల్లించలేదు అని స్ప‌ష్టం చేశారు.

సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద కేంద్రం 300 కోట్లు కేటాయించారు. దానిలో 70 కోట్లు బాల్కొండ లోని రోడ్లకు, బ్రిడ్జి కి కేటాయించుకున్నం. దాన్ని తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ ఎంక్వేరి కాదు అంతకు మించి ఇంకేమైనా ఇంక్వైరి చేసుకోవచ్చు. అయినా మీరు పని చెసే వాళ్ళ మీదనే మీరు ఈడీ లు, సిబిఐలు ప్రయోగిస్తారు. అదే మీ పని.” అంటూ అరవింద్ పై మంత్రి మండిపడ్డారు.