Site icon vidhaatha

రేవంత్‌కు బూస్ట్‌: TRSతో పొత్తు ప్రసక్తే లేదు.. పోరే: రాహుల్ గాంధీ

విధాత‌: టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తు గానీ పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ కుండ బద్దలు కొట్టారు. ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వానికి సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని వారి సూచించిన విధంగానే ముందుకు వెళ్తామంటూ స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య పోటీ ఉంటుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాధనాన్ని దోచు కుంటున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మునుగోడు ఉపఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని మండిప‌డ్డారు.

రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు తమది పెద్ద పార్టీగా ఊహించు కోవచ్చన్నారు. టీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదని రాహుల్ అన్నారు. చాలా సంవత్సరాల క్రితమే తాను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్నానని, కానీ కోవిడ్, ఇతర కారణాలతో చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌ రెడ్డికి బూస్ట్‌

రాహుల్ చేసిన వ్యాఖ్యలు బట్టి ఆ పార్టీ అధిష్టానం దీనిపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు తర్వాత జరిగే కర్ణాటకలోనూ పాగా వేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉన్నది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ ఉన్నది. బీజేపీది వాపే తప్పా బలుపు కాదని రాష్ట్రంలో సామాన్యులకు కూడా తెలుసు. రాహుల్ నిర్ణయంతో టీఆర్‌ఎస్‌పై మొదటి నుంచీ దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇది బూస్టింగ్ ఇచ్చే మాటనే.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లకు పరోక్ష హెచ్చరిక లాంటిదే. పార్టీనే సుప్రీం అన్నది ఇవాళ ఆయన ప్రెస్మీట్ చూస్తే అర్థమవుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నది స్పష్టమైంది.

Exit mobile version