విధాత: తెలుగు వారి ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గుర్తింపును ఇస్తోంది. ఆయన చిత్రంతో కూడిన వంద రూపాయల నాణెం (కాసు)ను విడుదల చేస్తోంది. నటుడిగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.
తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ అధికారానికి దూరం అయినా కూడా తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తిగా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మవిభూషణ్.. భారత రత్న వంటి అవార్డులు దక్కాల్సి ఉన్నా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయన్ను కావాలనే గుర్తించలేదు అని అంటారు.
ఏదైతేనేం మళ్ళీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్‌కి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వనుంది. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ వేసి ప్రజల్లోకి విడుదల చేసేందుకు కేంద్రం, రిజర్వ్ బ్యాంకు చర్యలు ప్రారంభించాయి. దీనికి సంబంధించి బీజేపీ నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరితో ప్రత్యేకంగా భేటీ అయి నమూనాని చూపించగా ఆ నమూనాకి ఆమె కూడా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం.
తెలుగు దేశం పార్టీ కూడా అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా ఎన్టీఆర్‌కి జాతీయ స్థాయిలో గౌరవం అందించే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. చంద్రబాబు ఎన్డీయేలో ఆరోజుల్లో కీలకంగా ఉన్న రోజుల్లోనూ ఎన్టీఆర్‌కు ఎలాంటి గుర్తింపూ వచ్చేలా కృషి చేయలేదు. మొత్తానికి ఈవిధంగా అయినా ఎన్టీఆర్ మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చారు.