Site icon vidhaatha

NTR Jayanti: ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

NTR Jayanti : దివంగత మాజీ సీఎం, నటరత్న నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఎన్టీఆర్ ఘాట్ వద్ధ ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్ వద్ధ నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, లక్ష్మీ పార్వతి ప్రభృతులు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించి ఆయన సినీ, రాజకీయ రంగాలలో తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. నారా భువనేశ్వరి మనుమడు దేవాన్ష్ తో కలిసి ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ధ నివాళులు అర్పించారు.

భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్‌కు పుష్పగుచ్ఛం సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలంటూ ఉత్త‌ర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. చంద్రబాబు సహా టీడీపీ నేతలు కడపలో జరుగుతున్నమహానాడులో ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన పాత్రలు చిరస్థాయిగా నిలిచాయన్నారు. సమాజం పట్ల ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చేందుకు మేం కృషి చేస్తామన్నారు.

Exit mobile version