ఓలా మరో సరికొత్త నిర్ణయం..! ఇక రెంటల్‌ బిజినెస్‌లోకి..!

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కంపెనీ ఓలా సరికొత్త ఐడియాతో ముందుకువస్తున్నది

  • Publish Date - January 2, 2024 / 06:45 AM IST

Ola Scooter Rent | భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కంపెనీ ఓలా సరికొత్త ఐడియాతో ముందుకువస్తున్నది. కంపెనీ త్వరలోనే ఈ-స్కూటర్‌ రెంటల్‌ సర్వీసులను ప్రారంభించబోతున్నది. కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. ‘పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్​1 ఉత్పత్తులను రెంటర్‌ సర్వీస్‌లు ప్రారంభించాలని ఆలోచిస్తున్నామన్న ఆయన.. దీనిపై స్పందన, సూచనలను కోరారు. అంతే కాదండోయ్‌ దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారని తెలుసుకోవడంతో పాటు బెస్ట్‌ కామెంట్‌, సూచనలు చేసిన ఒకరికి ఓలా ఎస్‌ఎక్స్‌ ప్లస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


ఓలా ఎలక్ట్రిక్‌ రెంటల్‌ సర్వీసులు ప్రస్తుతం మొదటి దశలోనే ఉంది. ప్రస్తుతం రెంటల్‌ సర్వీసులు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది ? అనే దారిపై కంపెనీ భావిస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ సీఈవో సోషల్‌ మీడియా వేదికగా సూచనలు కోరారు. అయితే, ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే చాలా ప్రయోజాలే ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ముఖ్యంగా ఎలక్ట్రిక్​ స్కూటర్ల యాక్సెసబిలిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుతం భారత్‌లో రెంటల్‌ బిజినెస్‌ ఊపందుకుంటున్నది. రెంటల్‌ బిజినెస్‌లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎప్పటికే ఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో సేవలను తీసుకురాగా.. 300 వరకు ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా 40కిపైగా మోటార్‌ సైకిల్​ రెంటల్​ ఆపరేటర్స్​తో ఒప్పందం చేసుకుంది.


రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి..


ఇప్పటికే రెంటల్‌ రంగంలోకి ప్రవేశించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కంపెనీ సేవలను పరిశీలించి.. ఈ మేరకు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఓలా ప్రస్తుత ఆలోచన అమలులోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంపెనీ మొబైల్​ యాప్​లో ఈ సేవలను తీసుకువచ్చే ఆలోచనలో ఓలా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో బైక్‌ రెంటల్​ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.


పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. బైక్స్​, స్కూటర్​​ని తీసుకుని టూర్‌ను ఎంజాయ్‌ చేసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా గోవా, మనాలి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఈ బైక్‌ రెంటల్ బిజినెస్‌ జోరుగా సాగుతున్నది. ఓలా ఆలోచన అమలులోకి వస్తే ఈ ఏడాది తొలినాళ్లలోనే సేవలు అందబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.

Latest News