న్యూఢిల్లీ : ఉల్లి గడ్డలు మళ్లీ కన్నీళ్లు పెట్టించనున్నాయా? తాజా ధరలను పరిశీలిస్తే.. అవుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతేడాది ఇదే రోజున ఉల్లి గడ్డ ధర కిలో సగటున 30 రూపాయలు ఉంటే.. అది ఇప్పుడు రూ.47కు పెరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ డాటా పేర్కొంటున్నది. అంటే.. దాదాపు 57శాతం పెరుగుదల ఉన్నది. దీంతో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు సబ్సిడీ ధరలపై కిలో 25 రూపాయలకు అందించేందుకు కేంద్రం బఫర్ నిల్వలను రిటైల్ మార్కెట్లకు విక్రయించాలని నిర్ణయించింది.
దేశ రాజధానిలో కిలో ఉల్లిపాయల రిటైల్ ధర ప్రస్తుతం రూ.40గా ఉన్నది. గతేడాది 30 రూపాయలు ఉన్నది. ధరలు మరింత పెరగకుండా నిరోధించేందుకు, వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ఆగస్ట్ మధ్య కాలం నుంచే బఫర్ నిల్వలను విడుదల చేస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్ ఒక వార్తా సంస్థకు తెలిపారు. ధరల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హోల్‌సేల్‌తోపాటు.. రిటైల్ మార్కట్‌లలోనూ బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొన్నది. ఆగస్ట్ మధ్య నుంచి దాదాపు 1.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను 22 రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. సహకార సంస్థలైన ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ విక్రయ కేంద్రాలు, వాహనాల ద్వారా రిటైల్ మార్కట్‌లకు బఫర్ స్టాక్‌ను కిలో 25 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఢిల్లీలో కూడా బఫర్ స్టాక్‌ను సబ్సిడీ ధరలపై విక్రయిస్తున్నారు. వానకాలం (ఖరీఫ్) సీజన్‌లో ఉల్లి పంట నాట్లలో జాప్యం, వాతావరణ పరిస్థితులతో పంట విస్తీర్ణం, దిగుబడి తగ్గిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇప్పుడిప్పుడే వానకాలం పంట దిగుబడి వస్తున్నా, తగినంత లేదు. వానకాలం పంట రావడంలో జాప్యంతో.. అప్పటికే నిల్వ చేసి ఉన్న యాసంగి (రబీ) పంట నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అది సరఫరాపై ప్రభావం చూపి, ధరలు అటు హోల్‌సేల్ మార్కట్‌లోనూ, ఇటు రిటైల్ మార్కెట్‌లోనూ పెరిగిపోతున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుత ఏడాదికి బఫర్‌స్టాక్‌ను రెండింతలు చేశామని చెప్పారు. దీని వల్ల రానున్న రోజుల్లో ధరల పెరుగుదలను అడ్డుకునే వీలు ఉంటుందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వినియోగదారుల శాఖ ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా ఐదు లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను ఉంచింది. దీనికి తోడు 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించేందుకు నిర్ణయించింది.