Opposition parties | బీజేపీని అడ్డుకోవడమే ఏకైక అజెండా.. పాట్నాలో భేటీకి ప్రతిపక్షాల సమాయత్తం

Opposition parties బీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ దూరం! బీజేపీతో పొత్తుకే కొన్ని ఈ పార్టీల మొగ్గు! వారిని కలుపుకొనే అంశంలె కూటమికి స్పష్టత! పాట్నా: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల సమావేశం వచ్చేవారం బీహార్‌ రాజధాని పాట్నాలో జరగనున్నది. ఆర్జేడీ-జేడీయూ కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ వివరించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ […]

  • Publish Date - June 15, 2023 / 03:37 PM IST

Opposition parties

  • బీఆర్‌ఎస్‌, టీడీపీ, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ దూరం!
  • బీజేపీతో పొత్తుకే కొన్ని ఈ పార్టీల మొగ్గు!
  • వారిని కలుపుకొనే అంశంలె కూటమికి స్పష్టత!

పాట్నా: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల సమావేశం వచ్చేవారం బీహార్‌ రాజధాని పాట్నాలో జరగనున్నది. ఆర్జేడీ-జేడీయూ కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. విపక్షాల కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ వివరించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ, జార్ఖండ్‌ సీఎంలు, మమతా బెనర్జీ, స్టాలిన్‌, కేజ్రీవాల్‌, హేమంత్‌ సొరేన్‌తోపాటు.. అఖిలేశ్‌ యాదవ్‌, ఉద్ధవ్‌ఠాక్రే, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా హాజరుకానున్నారు. కాంగ్రెస్‌తో విభేదాల వల్ల బీఆర్‌ఎస్‌, బీజు జనతాదళ్‌, బీఎస్పీ వంటి పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

ప్రధాన సమస్యలు ప్రజల్లోకి..

విపక్ష కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని ఎవరు అన్న అంశంపై చర్చను పక్కన పెట్టేసి.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు ప్రభావాలు, లోపభూష్టమైన జీఎస్టీ విధానాలను, మత సామరస్యత లోపించడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్యం గొంతునొక్కడం, కులాల వారీగా జనాభా లెక్కించాలన్నడిమాండు వంటి ప్రధాన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా విపక్షాలు ఒక అజెండాను రూపొందించి దానికి అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ అంశాలపై విపక్ష నేతలతో మాట్లాడి, వారి మద్దతు కూడగట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది.

విభేదాలున్నా ఐక్యతకే కృషి

ప్రస్తుతం ఈ కూటమిలో ఉన్న పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఒక అవగాహనకు రానున్నారు. దీనిపై పశ్చిమబెంగాల్‌ సీఎం ఇప్పటికే ఒక ప్రతిపాదన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే విధానాన్ని పాటించి ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు.

రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి సందర్భానికి అనుగుణంగా ఒక నిర్ణయానికి రావొచ్చు. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూసుకోవాలన్నది ఈ కూటమిలోని మెజారిటీ పార్టీ నేతల అభిప్రాయం. అందుకే ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో పాల్గొనే రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు 300 పైగానే. వీరంతా ఐక్యంగా కలిసి పనిచేస్తే బీజేపీని కట్టడిని చేయడం కష్టమేమీ కాదని విపక్ష నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఆహ్వానం లేదన్న గులాం నబీ

విపక్షాల ఐక్యత ప్రయత్నాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఎన్నికలకు ముందు కంటే ఫలితాల తర్వాత కూటమిగా ఏర్పడితే మేలని ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. సొంత కుంపటి పెట్టుకున్న గులాం నబీ అజాద్‌ అభిప్రాయపడ్డారు. పాట్నాలో భేటీకి తనకు ఆహ్వానం అందలేదన్నారు. అయితే.. అజాద్‌ వంటి నేతలను, టీడీపీ, వైసీపీ, బీఆర్‌ఎస్‌, బీజు జనతాదళ్‌, బీఎస్పీ లాంటి వాటిని కూటమి నేతలు సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణాలున్నాయి.

వారికి స్పష్టమైన అవగాహన కూడా ఉన్నది. యూపీలో బీజేపీ గెలుపు కంటే ఎస్పీ ఓటమే తమ లక్ష్యమని మాయావతి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అదే లక్ష్యంతో పనిచేశారు. దీంతో ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేకున్నా రాజకీయ కారణాలతో టీడీపీ, వైసీపీ కేంద్రంలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.

ఒడిశా సీఎం జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రథమ ప్రాధాన్యం అని ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. కాబట్టి అక్కడ ఉండే 21 స్థానాల్లో మెజారిటీ సీట్లను తమ పార్టీ ఖాతాలో వేసుకుంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని జనం అనుకుంటున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి బీజేపీ నేతలే బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలపై బీజేపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ అనేక రాష్ట్రాల్లో విపక్షాల నేతలను సీబీఐ, ఈడీ వంటి సంస్థలు విచారణకు పిలుస్తున్న సంగతి, అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటి కాకపోతే.. బీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలేవి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమనే ఏకైక లక్ష్యంతో పనిచేసే కూటమిలో కాంగ్రెస్‌ పార్టీని కాదని, ఆ పార్టీతో విభేదాలున్న పార్టీలను కలుపుకోవడం కంటే దూరంగా పెట్టడమే ఉత్తమం అనే అభిప్రాయం ఉన్నది. ఈసారి ఏమాత్రం పొరపాటు చేసినా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే స్పష్టత నేతలకు ఉన్నది. ఇవాళ కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అన్న బీజేపీ రేపు ఒకే పార్టీ, ఒకే ఎన్నిక అనే విధానాన్ని అమలు చేస్తే ప్రాంతీయ పార్టీల అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని అనుకుంటున్నారు.

అందుకే ఆ ప్రమాదాన్ని అడ్డుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ముందుగానే అప్రమత్తమవుతున్నారు. దీని ఫలితమే పాట్నా వేదికగా ఐక్య ప్రదర్శనతో పాటు ఉమ్మడి అజెండాను ఖరారు చేయనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన రోజు విపక్షాలన్నీ ఒక్క గొడుకు కిందికి వచ్చిన దానికి కొనసాగింపుగానే దీన్ని చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Latest News