-ప్రకంపనలు సృష్టిస్తున్న హిండెన్ బర్గ్ ఆరోపణలు
-నిజానిజాలు తేల్చాలంటూ పట్టుబట్టిన విపక్షాలు
-కుంభకోణంపై దర్యాప్తు చేయాలంటూ డిమాండ్
విధాత: అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్నే కుదిపేస్తున్నదిప్పుడు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు.. మోదీ సర్కారును నిలదీస్తున్నాయి. అదానీ సంస్థలకు సంబంధించి హిండెన్ బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని గురువారం 9 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
పార్లమెంటరీ ప్యానెల్ లేదా సుప్రీం కోర్టు నియమించిన కమిటీతోనైనా ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నాయి. ఈ క్రమంలోనే సాధారణ పార్లమెంట్ ప్రోసీడింగ్స్‌ను ఆపేసైనా అదానీ గ్రూప్ మోసం, దాని కారణంగా జరుగుతున్నషేర్ల పతనం, మదుపరుల ఆందోళనలపై చర్చించాలని పట్టుబట్టాయి. చర్చకు సంబంధించి నోటీసులనూ ఇచ్చారు.
ఏం జరుగుతున్నది?
నిజానికి ఉదయమే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్ ఆవరణలో సమావేశమై అసలు ఏం జరుగుతున్నదనే దానిపై చర్చించారు. ఈ విషయాన్ని సభలోనూ చర్చించి తీరాల్సిందేనన్న నిర్ణయానికొచ్చారు. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేడీయూ, వామపక్షాలకు చెందిన ప్రతినిధులు కూడా వీరిలో ఉన్నారు.
జీరో అవర్, కొశ్చన్ అవర్లను తొలగించి అదానీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్ సైతం ఓ అడ్జర్న్‌మెంట్ మోషన్ ఇచ్చారు. దేశ ప్రజానీకానికి, ఆర్థిక వ్యవస్థకు ఈ అదానీ వ్యవహారం ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉందని బీఆర్ఎస్ అన్నది. కేంద్రం తీరును ఎండగడతామని కేశవరావు గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉభయ సభల్లో నిలదీస్తామన్నారు.
ఎల్ఐసీ, ఎస్బీఐలకు భారీ నష్టం
అదానీ గ్రూప్ వ్యవహారంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ, సర్కారీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలకు భారీ నష్టమే వాటిల్లేలా ఉన్నది. సదరు గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగా, ఆయా సంస్థలకు ఎస్బీఐ భారీగా రుణాలిచ్చినట్టు తెలుస్తున్నది.
హిండెన్ బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయల్లో కరిగిపోతున్నది. నిజానికి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర్నుంచి అదానీ గ్రూప్ సంపద ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. గడిచిన మూడేండ్లలో 100 బిలియన్ డాలర్లకుపైగా ఎగబాకింది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీని వెనక్కినెట్టిమరి ఇటు భారత్‌లో, అటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
ఒకానొక దశలో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-3లో నిలిచారు. కానీ హిండెన్ బర్గ్ నివేదికతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో ముకేశ్ అంబానీయే మళ్లీ దేశీయ అపర కుబేరుడిగా అవతరించగా, బుధవారం ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ల జాబితాలో అదానీ 15వ స్థానానికి పడిపోయారు.
హిండెన్ బర్గ్ ఏం చెప్పింది?
అదానీ గ్రూప్ కంపెనీలకు మార్కెట్‌లో చూపిస్తున్నట్టుగా అంత విలువ ఉండదని హిండెన్ బర్గ్ తమ నివేదికలో పేర్కొన్నది. తాము చేసిన దర్యాప్తును పక్కనబెట్టి, మార్కెట్‌లో ఫండమెంటల్స్‌ను పరిశీలించినా ఇది అర్థమవుతుందని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ దాదాపు 85 శాతం కల్పితమేనని చెప్పింది. దీన్ని అదానీ గ్రూప్ కొట్టిపారేసినా.. మార్కెట్‌లో మాత్రం పెను ప్రకంపనల్నే సృష్టించింది. ఫలితంగానే వారం రోజుల్లో అదానీ గ్రూప్ విలువ 45 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరైపోయింది. ఈ మొత్తం గడిచిన ఏడాది కాలంలో పెరిగిన అదానీ గ్రూప్ విలువకు సమానం కావడం గమనార్హం.
మోదీ సర్కారు దన్ను
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దన్నుతోనే అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. పెట్టుబడులను ఉపసంహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం వెనుక అదానీ గ్రూప్ వ్యాపారాల విస్తరణ ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మోదీ హయాంలోనే అదానీ పోర్టులు, ఎయిర్‌పోర్టుల వ్యాపారాలు భారీగా పుంజుకోవడం కూడా వీటికి బలం చేకూరుస్తున్నాయి. సొంత రాష్ట్రం గుజరాత్‌కే చెందినవారు కావడంతో అదానీ గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదనీ అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తేనే నిజానిజాల నిగ్గు తేలుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.