Hafiz Saeed | ముంబయి దాడుల (26/11 ) సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలన్న భారత్ డిమాండ్‌ను యాదాది దేశం పాకిస్థాన్ తోసిపుచ్చింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ.. రెండుదేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేదని.. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత అధికారులు పాక్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.
అయితే, ఉగ్రవాది సయీద్ అప్పగింతపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. సయీద్ భారత్‌లో అనేక కేసుల్లో వాటెండ్ అని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సైతం ఉగ్రవాదిగా ప్రకటించిందని పేర్కొన్నారు. నిర్ధిష్ట కేసులో విచారణ కోసం అతన్ని భారత్‌కు అప్పగించాలని సంబంధిత పత్రాలతో పాక్ ప్రభుత్వానికి అభ్యర్థన పంపినట్లు బాగ్చి తెలిపారు.
హఫీజ్ సయీద్ పాక్ ఉగ్రవాది అని, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, హఫీజ్ సయీద్ జమ్మూ కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఘటనకు పాల్పడ్డాడు. దీంతో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. 2008 ముంబయి ఉగ్రదాడులు, పుల్వామా దాడిలో సయీద్ ప్రధాన సూత్రధారి. సయీద్ కొంతకాలం పాక్‌లో స్వచ్ఛ తిరుగుతూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం లష్కరే తోయిబా కోసం విరాళాలు సేకరించాడు.
భారత్ అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తీసుకురావడంతో 2019 సంవత్సరంలో హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లో అరెస్టు చేసి, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ ఆరోపణలపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. గత ఏడాది కూడా హఫీజ్ సయీద్‌కు ఉగ్రవాద ఘటనలకు డబ్బు సమీకరించాడన్న ఆరోపణలపై పాక్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
హఫీజ్ సయీద్ పార్టీ పాక్ ఎన్నికల్లో పోటీ
అమెరికా సైతం హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించి.. అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. హఫీజ్ సయీద్ పాక్ జైలులో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ అభ్యర్థులను అన్ని స్థానాల్లో నిలబెట్టడం గమనార్హం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ సైతం లాహోర్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్.. నిషేధిత సంస్థ జమాత్ ఉద్ దావాకు చెందిన రాజకీయ పార్టీ.