విధాత, హైదరాబాద్ : గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని.. గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ తప్పులను సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు అని విమర్శించారు. సిద్దిపేటలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించి మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షల్లో నిజంగా తప్పు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో అశోక్‌నగర్‌లో, ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ సభలో చెప్పించి మోసం నిరుద్యోగులను మోసం చేశారన్నారు.
నిరుద్యోగ యువతకు నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని…రెండేళ్లు పూర్తి కావస్తున్న 2లక్షలు ఉద్యోగాలు ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటిదాక ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి..పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమేనని..కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ఉద్యోగ హామీలపై తాము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా.. జాబ్ క్యాలెండర్ అని పారిపోయారని..అది కూడా జాబ్‌లెస్ క్యాలెండర్ గా మిగిలిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసాన్ని నిలదీస్తూ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని… అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తాం అని భరోసా ఇచ్చారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలనే మా ఆశయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. వెటర్నరీ కాలేజ్ ని సిద్దిపేటలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కి తరలించి సిద్దిపేటకు అన్యాయం చేశాడని విమర్శించారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టి 90% పని పూర్తచేస్తే మిగిలిన చిన్న పనిని కూడా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.