విధాత, హైదరాబాద్ : గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆకస్మాత్తుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముట్టడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న తెలంగాణ జాగృతి నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకల నేపధ్యంలో హైకోర్టు మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేసింది. మెయిన్స్ పరీక్షల రీవాల్యూయేషన్‌కు ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తిచేయాలని..ఒకవేళ రీవాల్యూయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. అవకతవకలకు తావు లేకుండా రీ వాల్యుయేషన్ చేయాలని..ఆ తర్వాతే 563 మందిని ఎంపిక చేసి పోస్టింగులు ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైంది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని నిర్ణయించింది.