హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విధాత) :
Kalvakuntla Kavitha Singareni Corruption | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో అవినీతి రాజ్యమేలుతున్నదని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రతి కాంట్రాక్టులో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని అన్నారు. సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పారు. సింగరేణలో చోటు చేసుకుంటున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డిని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని ఆమె ప్రకటించారు.
శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ (ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గం) – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన కవితను హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు యాజమాన్యం కొత్త కొర్రీలు పెడుతున్నదని, పదో తరగతి పాస్ కాలేదంటూ 470 వారసత్వ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టారని కవిత వివరించారు. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలలో నియమించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోంది.. ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలి అని ప్రశ్నించారు. గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచుకోలేకపోయాం, దీన్ని పరిష్కరించుకోవడంతో పాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విధానం కొనసాగాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారు. గతంలో తాను వారికి కనీస వేతనాలు వచ్చేలా కృషి చేశానని కవిత అన్నారు.