విధాత, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ నన్ను పిలిస్తే విచారణకు ఖచ్చితంగా వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కవిత స్పందించారు. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తానని, నాఫోన్, నాభర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయి అని కవిత తెలిపారు.కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు అని, అయితే చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని, ప్రజా జీవితంలో ఉన్నప్పుడూ ఇవన్నీ ఎదుర్కోవాల్సిందేనని తెలిపారు. నేను గతంలో ఈడీ, సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్లానని గుర్త చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుంటనక్క హరీష్ రావుతో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నందునా మున్సిపల్ ఎన్నికల్లో ఏదో హడావుడి చేసి ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్లీ వదిలేస్తారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పట్లో ముగించదు.. నిజమైన నేరస్తులు బయటికి వస్తారని అనుకోవడం లేదు.. ఈ కేసులో ప్రభుత్వ తీరు స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లుగా ఉంది అని కవిత ఎద్దేవా చేశారు.
‘సిట్ విచారణలో ఏంజరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నానని, రెండేళ్లవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదు అన్నారు. పారదర్శకంగా విచారణను త్వరగా ముగించాలని, దోషులకు శిక్షపడాలి అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మళ్లీ అన్యాయం
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం 47అంశాలపై నిధులు, అనుమతులు కోరితే ఒక్కదానికి కూడా కేటాయింపులు చేయకపోవడం అన్యాయం అని కవిత విమర్శించారు. ఫెడరల్ స్పూర్తికి ఇది విరుద్దం అని, తెలుగింట బిడ్డ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం బాధకరం అన్నారు. ఐఐటీ, నవోదయ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ వంటివి అన్ని పెండింగ్ లో ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటూ ప్రధాని మోదీని అభివర్ణించినా కనీసం 30వేల కోట్ల నిధులు కూడా సాధించకపోవడం విచారకరం అన్నారు. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తన పరిధిలో ఉన్న శాఖ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు. హైదరాబాద్ లో హత్యలు, హత్యాయత్నాలు, గన్ కల్చర్ పెరిగిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
ఫేక్ కంపెనీలతో ఎంవోయూల పేరిట కాంగ్రెస్ మోసం
సీఎం రేవంత్ రెడ్డి మూడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలకు హాజరయ్యారని, హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని..అయితే ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు సాధించారో వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. ఫస్ట్ సమ్మిట్ లో అమెరికా ట్రంప్ మీడియా టెక్నాలాజీ సంస్థ విలువ రూ.30వేలు కోట్లు అయితే..తెలంగాణలో ఆ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతామన్నదానిపై స్పష్టత లేదన్నారు. సింగపూర్ ఏజీఐడీసీ 67,500కోట్లు పెడుతామని చెప్పిందని, దాని అడ్రస్ దొరకడం లేదన్నారు. ఇన్ ఫ్రాకీ డేటా సంస్థ 70వేల కోట్లకు ఎంవోయూ చేసుకుందని, ఈ సంస్థ బ్రెజిల్, అమెరికాలలో కూడా వేల కోట్ల ఎంవోయులు చేసుకున్న తీరు చూస్తుంటే అదో ఫేక్ కంపెనీ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. గ్రూప్ ఫీల్డ్ అక్సెస్ సంస్థ రూ. లక్ష కోట్ల ఎంవోయూలు చేసుకుందని, దాని సామర్థ్యం కంటే ఎక్కవ చేయడం అనుమానస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అస్తర్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ రూ. 5,600కోట్లకు ఎంవోయూ చేసుకుందని..దీనిపై ఆయనే స్పష్టత ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలపై ప్రచారం
భారత్ గరుడ 2,100కోట్లతో కార్లు కంపెనీ పెడుతామని ఎంవోయూ చేసిందని, దీని విలువ రూ.10లక్షలు మాత్రమే అని, అతిరథ్ హోల్డింగ్ కంపెనీ, ఎస్ఎల్ఆర్ సురభీ కంపెనీ, ఆర్సీ టీ ఎనర్జీ, ఉర్సా క్లస్టర్ కంపెనీ రూ.500కోట్ల ఎంవోయూ చేసుకుందని, తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం అని, అవన్ని కూడా ఫెక్ కంపెనీలు, ఫేక్ ఎంవోయూలు అని కవిత ఆరోపించారు. దాదాపు 20ఫేక్ కంపెనీలు ఉన్నాయని తాము గుర్తించామన్నారు. హాష్ ట్యాగ్ .. కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూస్ అని దీనిపై ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఉద్యోగాలను తామే ఇచ్చినట్లుగా యువతను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. ఇలాంటి ఫేక్ కంపెనీలతో యువతకు ఎలా ఉద్యోగాలు ఇస్తారని కవిత ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం
మున్సిపల్ ఎన్నికల తర్వాత మరోసారి జనం బాట కొనసాగుతుందని కవిత తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాచరిక పోకడలతో వారు ఎవరిని పెడితే వారికే ఓటు వేయాలని ప్రజలను బెదిరిస్తుందన్నారు. అభ్యర్థి మంచోడు అయినా.. చెడ్డోడు అయినా మా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఫోన్ ట్యాపింగ్ లో విచారణకు మమ్మల్ని ఎట్లా పిలువద్దన్నట్లుగా మాట్లాడుతున్నారని, అసలు కేసీఆర్ ను విచారణకు పిలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో వారు పరిశీలన చేసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ లో ఆలోచన విధానం మారనంతవరకు ఆ పార్టీని ఎవడు బాగు చేయలేడు అని కవిత విమర్శించారు. ఇక బీజేపీ ఇవ్వగలిగే స్థాయిలో ఉండి తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో జనాన్ని మభ్యపెడుతుందన్నారు. అందుకే తెలంగాణలో సరికొత్త రాజకీయం రావాల్సిన అవసరం ఉందని, ఇందుకు జాగృతితో కలిసి యువత ముందుకు నడవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం, మతం, చుట్టమని లేదా పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దు అన్నారు.
అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయండి అని, పైసలు అడిగిటోడు కాకుండా ఆపతి, సాపత్ కి మనకు పనిచేసేటోళ్లను గెలిపించండి అని కోరారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతాం అని, జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపాం అని తెలిపారు. మేము మంచి అభ్యర్థులను పెట్టాం. వారికి ఓటు వేసి గెలిపించండి అని కవిత కోరారు.
ఇవి కూడా చదవండి :
Boy Steals Gold For Momos : బాలుడి నిర్వాకం.. మోమూస్ కోసం ఇంట్లోని బంగారాన్ని దొంగిలించి..
Dalai Lama : 90 ఏళ్ల వయసులో రికార్డు.. దలైలామాకు గ్రామీ అవార్డు
