కొలంబియాలో భూకంప విలయం..భారీగా ఆస్తి, ప్రాణ నష్టం

కొలంబియా దేశాన్ని భారీ భూకంపం వణికించింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం పశ్చిమ కొలంబియాను తీవ్రంగా కుదిపేసింది. మనిజాలెస్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రతతో దేశంలో ఇప్పటివరకు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Aug 11, 2026, 12:15 pm IST
Read Time: 4 mins
కొలంబియాలో భూకంప విలయం..భారీగా ఆస్తి, ప్రాణ నష్టం

కొలంబియా దేశాన్ని భారీ భూకంపం వణికించింది. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం పశ్చిమ కొలంబియాను తీవ్రంగా కుదిపేసింది. మనిజాలెస్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.భూకంప కేంద్రం చోకో ప్రావిన్స్‌లోని శాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొలంబియా చరిత్రలోనే ఇది అతి పెద్ద భూకంపంగా అధికారులు పేర్కొన్నారు.

భూకంపం తీవ్రత ధాటికి పెద్ద పెద్ద భవనాలు చెట్ల కొమ్మల్లా ఊగిపోయి పేకమేడల్లా కుప్పకూలాయి. ఇక అద్దాల భవనాలు, గోడలు క్రాక్స్ వచ్చి నేలమట్టమయ్యాయి. భద్రత కోసం చాలామంది తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. పెరీరా, కాలి, క్విబ్డో నగరాల్లో భవనాలు కూలిపోతున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. మనిజాలెస్ నగరంలోని చారిత్రక నియో-గోథిక్ కేథడ్రల్ టవర్ కూడా కూలిపోయింది.

భూకంప తీవ్రతతో దేశంలో ఇప్పటివరకు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 570 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్ర‌మాదం పొంచి ఉంది. అత్యధికంగా రిసరాల్డా ప్రావిన్స్ లో 42 మంది మృతి చెందారు. కాలి సిటీలో 30 భవనాలు కుప్పకూలాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. భూకంపం కారణంగా 1,575 గృహాలు, 18 హెల్త్ సెంటర్లు, 52 స్కూళ్లు పాశ్చికంగా దెబ్బతిన్నాయని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

చోకో ప్రావిన్స్ లోని శాన్ జ్యూస్ డెల్ పాల్మర్ సమీపంలో 107 కిలో మీటర్ల లోతులో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యూఎస్ జియోజికల్ సర్వే స్పష్టం చేసింది. అటు పొరుగు దేశ‌మైన ఈక్వెడ‌ర్ లోనూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఆ దేశంలోనూ పలు భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయి.