విధాత: కోర్టులు, ప్రతిపక్షాలు ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది ఎలాగైనా చేసే తత్వం ఉన్న జగన్ ఇప్పుడు రాజధాని విషయం మీద కూడా అదే పట్టుదలతో ఉన్నారు. మూడు రాజధానులకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కోర్టుల రూపంలో పలు అడ్డంకులు ఎదురవుతున్నా జగన్ మాత్రం వెనకడుగు వేసేదే లేదంటున్నారు. విశాఖ బాట పెట్టాల్సిందే అని డిసైడ్ అయిన జగన్ ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు విశాఖలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా విశాఖలో రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో నిర్మిస్తున్న పార్టీ ఆఫీసు అతి తొందరలోనే రాష్ట్ర ఆఫీసుగా మారుతోంది అని అంటున్నారు.
వైసీపీ కేంద్ర కార్యాలయం ఇపుడు తాడేపల్లిలో ఉంది. అయితే దాన్ని సాధ్యమైనంత తొందరలోనే విశాఖకు తరలించేందుకు రెడీ అవుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి మాటలను బట్టి అర్ధం అవుతోంది.
మొదటి దశ నిర్మాణం పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయని, ఉగాది నాటికి విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు.
అంటే విశాఖ రాజధానికి ఇది తొలి మెట్టు అవుతుందని అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి ఇప్పటి దాకా ఏపీలోని అన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయాలు విజయవాడలోనే ఉన్నాయి. కొత్తగా జాతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్ కూడా తన ఏపీ ఆఫీస్‌ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా భావించి సమీపంలోనే తమ పార్టీ ఆఫీసులు పెట్టుకున్నాయి. ఇపుడు సడెన్‌గా వైసీపీ తన రాజధాని మాత్రం విశాఖ అని చెప్పబోతోంది. విశాఖ మీద మొదటి నుంచి మోజు పెంచుకుంటున్న జగన్ పాలన అక్కడి నుంచే చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
అయితే విశాఖ రాజధాని అని అటు రాజకీయ జనాలకు ఇటు రాష్ట్ర జనాలకు బలమైన సంకేతం ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. ఇదిలా ఉంటే కొత్త ఏడాది విద్యా సంవత్సరం నాటికి ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా విశాఖకు తరలివస్తుంది అని మంత్రి గుడివాడ అమరనాథ్ చెబుతున్నారు. మొత్తానికి ఆరేడు నెలల్లో అంతా విశాఖలోనే ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతోంది.