విధాత: భారత్‌లో పైలట్లతో పాటు విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడకుండా త్వరలోనే బ్యాన్ విధించనున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి ఆమోద ముద్రవేస్తే పైలట్లతో పాటు విమాన సిబ్బంది డ్యూటీ సమయంలో పెర్ఫ్యూమ్ వేసుకునేందుకు అనుమతి ఉండదు.
అయితే, విమానంలో డ్యూటీ సమయంలో పెర్ఫ్యూమ్‌ను వినియోగించినట్లయితే డీజీసీఏ చర్యలు చేపట్టనున్నది. సెంట్లతోపాటు, ఆల్కహాల్ కంటెంట్ ఉన్న మందులు, మౌత్‌వాష్ ఉత్పత్తులను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ ఉత్పత్తుల కారణంగా బ్రీత్‌లైజర్ పరీక్షల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల వైద్య పరీక్షల పద్ధతిలో మార్పులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ప్రతిపాదించింది.
ఇందులో భాగంగా పైలట్లు, సిబ్బంది ఆల్కహాల్ డ్రింకింగ్ టెస్టింగ్ విధానాన్ని మార్చబోతున్నది. ఈ క్రమంలోనే కొత్త ప్రతిపాదనల్లో సిబ్బంది, పైలట్లు ఆల్కహాల్‌తో కూడిన మందులు, పెర్ఫ్యూమ్, దంత ఉత్పత్తులను ఉపయోగించకూడదని చెబుతున్నది. ఆయా ఉత్పత్తుల కారణంగా ఆల్కాహాల్ టెస్ట్ నిర్వహించిన సమయంలో పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
అయితే, ఆల్కాహాల్ సంబంధిత ఉత్పత్తులు తీసుకునే సమయంలో వైద్యుడిని సంప్రదించాలని ప్రతిపాదనలో సూచించింది. వాస్తవానికి పెర్ఫ్యూమ్‌లో తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ను వినియోగిస్తుంటారు. ఈ కొద్దిపాటి ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షను ప్రభావితం చేస్తుందా? అనేది స్పష్టంగా పేర్కొనలేదు. భారత్‌లో విమానయాన సంస్థల్లో పైలట్లు, సిబ్బంది మద్యపానానికి సంబంధించి కఠిన నిబంధనలున్నాయి. విమానయాన సంస్థలతో పాటు డీజీసీఏ వేర్వేరుగా టెస్టులు చేస్తుంటాయి.