Site icon vidhaatha

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో మంటలు..! అబుదాబిలో అత్యవసర ల్యాండింగ్‌..!

Air India Express Flight | అబుదాబి నుంచి కాలికట్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం గాలిలో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని తిరిగి అబుదాబిలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని డీజీసీఏ ధ్రువీకరించింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ B737-800 VT-AYC ఆపరేటింగ్ ఫ్లైట్ IX 348 అబుదాబి నుంచి కాలికట్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ అయ్యింది.

తర్వాత విమానం ఒకటో నంబర్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్పటికే విమానం వెయ్యి అడుగుల ఎత్తుకు చేరింది. అనంతరం విమానాన్ని సురక్షితంగా అబుదాబిలో దింపారు. డీజీసీఏ సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాకులు ఉన్నారు. విమానం టేకాఫ్‌ అయ్యి వెయ్యి అడుగుల ఎత్తుకు చేరగా.. విమానం పైలెట్‌ ఇంజిన్‌లో స్పార్క్‌ రావడం గమనించాడని, ఆ తర్వాత విమానాన్ని వెంటనే అబుదాబికి మళ్లించినట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌పెర్స్‌ తెలిపింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇంతకు ముందు జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్‌కు వెళ్లే విమాన సైతం సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్‌ చేసిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 22న కాలికట్‌ నుంచి దుబాయి వెళ్లే విమానంలో పాము కనిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version