‘Nagin’ Mystery | ‘నాగిని’గా మారిపోయిన యువతి? యూపీ గ్రామంలో భయాందోళనలు – అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్ ఔరైయా జిల్లాలో రాత్రి పడుకున్న యువతి తెల్లవారేసరికి మాయం కావడం, మంచంపై పాము కుబుసం, తన గాజులు, నగలు ఉండటంతో ఊరంతా ఉలిక్కిపడింది. అమ్మాయి నాగినిగా మారిపోయిందంటూ గ్రామంలో పెద్దయెత్తున భయందోళనలు వ్యక్తమయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టి అసలు విషయం బయటపెట్టారు.

👉 Half snake half woman nagin illustration representing UP mystery case

She Vanished Overnight, Snake Skin on the Bed – What Really Happened?

పాము కుబుసంతో ‘నాగిని’ మిస్టరీ

ఔరైయా జిల్లాలో యువతి పాము చర్మం పెట్టి అదృశ్యమై సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ నాటకం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

విధాత వైరల్​ డెస్క్​ | హైదరాబాద్​:

‘Nagin’ Mystery | ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లా సింగన్‌పూర్ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రాత్రి నిద్రపోయిన యువతి ఉదయం కనిపించకపోవడం, ఆమె మంచంపై ఐదు అడుగుల పొడవైన పాము కుబుసం, ఆభరణాలు, బట్టలు ఉండటంతో గ్రామమంతా భయాందోళనలకు గురైంది. కొందరు ఆమె ‘ఇచ్చాధారి నాగిని’గా మారిపోయిందంటూ ప్రచారం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

మిస్టరీగా మారిన యువతి అదృశ్యం

20 ఏళ్ల యువతి రీనా ఆదివారం రాత్రి సాధారణంగానే తన గదిలో నిద్రకు వెళ్లింది. సోమవారం ఉదయం తల్లి ఆమెను లేపేందుకు వెళ్లగా గది ఖాళీగా కనిపించింది. మంచంపై పాము కుబుసం, ఉంగరం, మెడదారం, గాజులు చక్కగా అమర్చివుండటాన్ని చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఈ విషయం క్షణాల్లో గ్రామమంతా వ్యాపించింది. ఆమె నాగినిగా మారిపోయిందనే వదంతులు చెలరేగాయి. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఇంటి వద్దకు చేరుకున్నారు. భయంతో కుటుంబ సభ్యులు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల దర్యాప్తు – నాగిని నిజం వెలుగులోకి

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. గదిలో పాము గూడు ఉన్నట్లు గుర్తించినా, ‘నాగిని’ వాదనలో నిజం లేదని తేల్చారు.

దర్యాప్తులో యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. కుటుంబ సభ్యులు వేరే పెళ్లి ఏర్పాటు చేయడం వల్ల ప్రియుడితో పారిపోవడానికి ఆమె ఈ నాటకాన్ని రచించింది. కుబుసాన్ని తెచ్చి బట్టల్లో చుట్టి మంచంపై పెట్టి, తెల్లవారుజామున ప్రేమికుడితో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు కూడా ఆమె గత రెండు రోజులుగా పొలాల్లో తిరుగుతూ పాము చర్మం కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

ఇది పూర్తిగా సినిమా తరహా డ్రామా అనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఏర్పాటు చేసిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ మనోజ్ గంగ్వార్ మాట్లాడుతూ, “ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ఆడిన నాటకం. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దు” అని అన్నారు.

మూఢనమ్మకాలపై పోలీసుల హెచ్చరిక

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మూఢనమ్మకాలు, వదంతులను నమ్మకుండా చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం యువతి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ప్రేమ వ్యవహారం బయటపడిన తర్వాత గ్రామంలో నెలకొన్న భయాందోళనలు సద్దుమణిగాయి. త్వరలోనే యువతిని గుర్తించి కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Latest News