Municipal Elections | రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణ ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఈ ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్‌బృందాలు, 1370 రిటర్నింగ్ అధికారులు, 1547 ఏఆర్ఓలు 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. సుమారు 25 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు.
13న ఓట్ల లెక్కింపు..
ఈ నెల 13వ తేదీ ఉదయం 8 నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల14న నోటీసు జారీ చేస్తారు. 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు.
