Kondagattu | నేటి నుంచి కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు
Kondagattu | తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు( Kondagattu ) ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి( Pedda hanuman Jayanthi ) వేడుకలు ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి.
Kondagattu | తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు( Kondagattu ) ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి( Pedda hanuman Jayanthi ) వేడుకలు ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మంగళవారం వరకు జరిగే ఈ వేడుకలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కొండగట్టు దారులన్నీ జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోతోంది.
భద్రాచలం ఆలయ అధికారులు మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పిస్తారు. హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు.. ఈ మూడు రోజుల పాటు తమ దీక్షలను విరమించనున్నారు. ఇందుకు 500 మంది అర్చకులను నియమించారు. ఈ వేడుకల దృష్ట్యా అధికారులు నాలుగు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. మే 14న అన్ని సేవలు తిరిగి ప్రారంభమవుతాయి.

మండుటెండల నేపథ్యంలో భక్తులను దృష్టిలో ఉంచుకుని.. చెక్ పోస్టు నుంచి ఆలయం వరకు తాత్కాలికంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల నిర్వహణ కోసం పోలీసులు, అధికారులు, పారిశుధ్య కార్మికులతో సహా వివిధ శాఖలకు చెందిన సుమారు 2,000 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 20 ప్రదేశాలలో తాగునీటి వసతులతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచారు. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హనుమాన్ జయంతి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పర్యవేక్షిస్తున్నారు. బొజ్జపోతన ఆలయం నుంచి కొండగట్టు వై జంక్షన్ వరకు భక్తులను ఉచితంగా తరలించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram