న్యూ ఢిల్లీ :
విమాన ప్రయాణికులకు డీజీసీఏ శుభవార్త తెలిపింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా డీజీసీఏ (Directorate General of Civil Aviation) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా టికెట్ల రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు లేదా తమ స్లాట్ మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. డీజీసీఏ చెప్పినట్లే, బుక్ చేసిన 48 గంటల్లోపు టికెట్ రద్దు చేస్తే మొత్తం రీఫండ్ అవుతుంది. టికెట్ రద్దు లేదా ప్లాన్ మార్చడం కోసం ‘లుక్ ఇన్ ఆప్షన్’ను విమానయాన సంస్థలు అందించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
దేశీయ విమానాల కోసం 5 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ముందు బుక్ చేసిన టికెట్లు, అంతర్జాతీయ విమానాల కోసం 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ముందు బుక్ చేసిన టికెట్లు రద్దు చేస్తే వాటికి ఎలా రీఫండ్ పొందాలో కూడా డీజీసీఏ వెల్లడించింది. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినవారికి 7 రోజుల్లోపు రీఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. కౌంటర్ ద్వారా నగదుతో చెల్లించినవారికి వెంటనే రీఫండ్ చెల్లించాలి. ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినవారికి 21 రోజుల్లోపు రీఫండ్ చెల్లించారు. డీజీసీఏ సూచనల ప్రకారం.. ఎమర్జెన్సీ సమయాల్లో తమ ప్లాన్లు మార్చుకోవాలనేవారికి లేదా టికెట్లు రద్దు చేసుకోవాలనేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విమాన ప్రయాణికులు ఇకపై రద్దు విధానాల కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గుతాయని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు.
