Ajit Pawar plane crash| విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

విధాత: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజిత్ పవార్ తో పాటు ఇద్దరు పైలట్లు, సెక్యూరిటీ గార్డు, పిఏ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతలో విమానం ముక్కలుగా విడిపోగా.. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయు. అజిత్ పవార్ మృతదేహాన్ని బారామణి మెడికల్ కాలేజీకి తరలించారు.

సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తిందని సమాచారం, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలోఅదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. కూలిన విమానం బంబార్డియర్ లిర్జట్ 45రకం 8సీటర్ విమానంగా పేర్కొంది.

అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం

అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించాడు. ఆయన తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ రాజకీయ నాయకుడిగా కొనసాగారు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్‌ 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. 16ఏళ్ల పాటు పూనే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. 1991 లో తొలిసారి బారామతి నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శరద్ పవార్ తో విబేధించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అంతకుముందు షిండే మంత్రివర్గంలోనూ డిప్యూటీ సీఎంగా కొనసాగారు.

అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఫఢ్నవిస్, మంత్రివర్గ సహచరులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలిపారు.

 

Latest News