• Telugu News
  • /Telangana

భూముల రిజిస్ట్రేషన్లకు ఒకటే వెబ్ పోర్టల్.. భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టళ్ల విలీనం

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, మండల తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ పోర్టళ్లను ప్రభుత్వం విలీనం చేయనున్నది. ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. అక్రమ రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేయనున్నది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Aug 01, 2026, 8:30 pm IST
Read Time: 14 mins
భూముల రిజిస్ట్రేషన్లకు ఒకటే వెబ్ పోర్టల్.. భూ భారతి, సబ్ రిజిస్ట్రార్ పోర్టళ్ల విలీనం

హైలైట్స్:

  • సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో డ్యాష్ బోర్డు
  • నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదు
  • త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం
  • రీ సర్వేలో వాస్తవ విస్తీర్ణం ప్రకారమే పాస్‌ పుస్తకాలు
  • సర్వే నంబర్‌తో సంబంధం లేకుండా కాస్తు భూములకే హక్కులు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

విధాత, హైదరాబాద్:
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, మండల తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న వెబ్ పోర్టళ్లను ప్రభుత్వం విలీనం చేయనున్నది. ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏ రోజు ఏ కార్యాలయం పరిధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? ఎంత ఆదాయం సమకూరింది? అనే వివరాలు తెలుసుకునేందుకే కాకుండా.. నిషేధిత భూములు, ప్రభుత్వ భూములను రిజిస్టర్స్‌ చేస్తే ఈ పోర్టల్‌ ద్వారా ఆ వెంటనే తెలిసిపోతుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం నాలా భూములను తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, అసైన్డు భూములు, నిషేధిత భూములు ఇలా పలు రకాల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మున్ముందు ఇలాంటి అక్రమ లావాదేవీలు జరగకుండా శాశ్వత ప్రతిపాదికన ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ పోర్టళ్లను తయారు చేయిస్తున్నామని, ఈ పోర్టల్ నుంచే సబ్ రిజిస్ట్రార్లు, మండల తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నానని, ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఎంత ఆదాయం సమకూరింది, రద్దీ ఎలా ఉందనేది చూసుకునే వెసులుబాటు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమిస్తున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. శనివారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఇళ్లు వెలిశాయని, వాటికి బహిరంగ మార్కెట్ లో సగం ధర నిర్ణయించి రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన ఉందన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అసైన్డు భూముల్లో పొజిషన్ లో ఉన్న వారికి క్రమబద్దీకరణ అవకాశం కల్పిస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

పొజిషన్‌లో ఉన్నవారికే శాశ్వత హక్కులు

అస్సైనీ భూములను తిరిగి ఎట్టి పరిస్థితుల్లో యజమానులకు అప్పగించే ప్రసక్తి లేదని, పొజిషన్ లో ఉన్నవారికే శాశ్వత హక్కు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని మంత్రి స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుగా చేసుకుని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ప్రతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని, నిజాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. అంతేగాక ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తామ‌న్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది? ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు? తర్వాత ఎందుకు తొలగించారు? అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క గుంట భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులు లేదా ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

276 గ్రామాల్లో రీసర్వే పూర్తి

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కేవలం రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని ఆయన వివరించారు. కాస్తు లేదా పొజిషన్ లో ఉన్నవారికి సర్వే చేసి ఆ ప్రకారంగానే పాస్ పుస్తకం, మ్యాపులను యజమానికి మంజూరు చేస్తామన్నారు. పాత సర్వే నెంబర్లతో సంబంధం లేదని, యజమాని లేదా రైతు ఎన్ని ఎకరాలు కాస్తు చేస్తున్నారు లేదా పొజిషన్ లో ఉన్నారనేది తెలుసుకుని సర్వే చేసి హద్దులు ఖరారు చేస్తారన్నారు. పొజిషన్ లో ఉన్నప్పటికీ, సర్వే నెంబర్లతో సరిపోలకపోయినా, భూమి ఒక చోట, సర్వే నెంబర్ మరో చోట ఉన్నా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. భూమి ఉన్న చోటే సర్వే నిర్వహించి యజమానిగా నిర్థారిస్తారస్తారన్నారు. రీ సర్వే లో ఎలాంటి తప్పులు లేకుండా యజమానికి వాస్తవ హక్కులు కల్పిస్తారన్నారు. పాస్ పుస్తకంలో భూమి ఎక్కువగా నమోదు అయి, కాస్తు లేదా పొజిషనలో తక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రకారంగానే తగ్గించి కొత్తగా జారీ చేసే పాసు పుస్తకంలో నమోదు చేస్తామన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో పైలెట్ సర్వే నిర్వహించగా భూముల అసలు వాస్తవం వెలుగు చూసిందన్నారు. గ్రామంలో మొత్తం 8600 ఎకరాలు ఉన్నట్లు పాసు పుస్తకాల్లో వెల్లడి అయ్యిందన్నారు. సర్వే తరువాత ఏడు వేల ఎకరాలు మాత్రమే ఉన్నట్లు స్పష్టం అయ్యిందన్నారు. ఆ ప్రకారంగానే రైతులకు పాసు పుస్తకాలు జారీ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు.

ఇందిరమ్మ టవర్లను జీర్ణించుకోలేని బీఆరెస్‌ నేతలు

క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి పొంగులేని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ కన్నా ఎక్కువ విలువ కలిగిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేసి ఇస్తున్నామన్నారు. డబ్బులు చెల్లించిన తరువాత లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లు ఇస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చారని, రిజిస్ట్రేషన్ చేయలేదని ఆయన దెప్పి పొడిచారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లలో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయని మీడియా దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది గత ప్రభుత్వ నాణ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్లను కూడా మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా వార్షిక ఆదాయం సుమారు రూ.13 వేల కోట్లు ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.