విధాత : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ తాజాగా చేసిన సంచలన ఆరోపణలు విమాన ప్రమాదంపై అనుమానాలు మళ్లీ రాజేశాయి. ప్రధాన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందంటూ రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, ఇందులో కుట్ర కోణం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. అజిత్ పవార్‌ను విమాన ప్రయాణానికి బలవంతం చేశారని ఆయన ఆరోపించారు. అసలు 7:00కి బయలుదేరాల్సిన విమానం 8:10గంటలకు బయలుదేరిందని.. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. అజిత్ పవార్ ముందురోజే రోడ్డు మార్గంలో బారామతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. చివరి నిమిషంలో ఒక సీనియర్ నేత రావడం, కొన్ని అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయాల్సి రావడంతో పరిస్థితి మారిందని, ఆ తర్వాతే విమాన ప్రయాణం నిర్ణయమైందని అన్నారు.
విమాన పరిస్థితిపై సాంకేతిక నివేదికలు ఎక్కడా ?
ప్రమాదానికి రెండు రోజుల ముందు ఆ విమానం సూరత్‌కు వెళ్లిందని, దీన్ని ‘మెయింటెనెన్స్ ఫ్లైట్’గా పేర్కొన్నారని రోహిత్ ఆరోపించారు. విమానం సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా..? ఎయిర్‌వర్తినెస్ రిపోర్టులు, టెక్నికల్ లాగ్స్ ఎక్కడ..? హ్యాంగర్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డీజీసీఏ నివేదికలో సమయానికి సంబంధించి 20 సెకన్ల వ్యత్యాసం ఉందని, దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగడం లేదని రోహిత్ పవార్ విమర్శించారు. వీఎస్ఆర్ విమానయాన సంస్థకు డీజీసీఏ నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. బ్లాక్ బాక్స్ పూర్తి రికార్డింగ్‌ను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పైలట్ డ్రంకన్ పైలట్ లిస్టులో ఉన్నారు!
కెప్టెన్ పైలట్ కపూర్ గతంలో “డ్రంకెన్ పైలట్ లిస్ట్”లో ఉన్నారని, చివరి నిమిషంలో పైలట్లను మార్చారని రోహిత్ పవార్ ఆరోపించారు. అసలు నియమించాల్సిన పైలట్లు ఎందుకు రాలేదని, వారిపై బ్రెత్ అనలైజర్ పరీక్షలు జరిగాయా అని ప్రశ్నించారు.ప్రమాదానికి ఒక నిమిషం ముందు విమానం ట్రాన్స్‌పాండర్ ఆఫ్ అవ్వడం అనుమానాస్పదంగా ఉందని రోహిత్ పవార్ తెలిపారు. కో-పైలట్ ‘ఓహ్ షిట్’ అంటూ స్పందించినా, ప్రధాన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరింత సందేహాలకు దారితీస్తోందని చెప్పారు. ఆయన నిద్రలో ఉన్నారా..? లేక ఇది ముందే పన్నిన ప్రణాళికనా..? అని రోహిత్ ప్రశ్నించారు.
అజిత్ పవార్ తనతో ఒకసారి.. నమ్మకమైన హెలికాప్టర్ లేదా సొంత విమానం ఉండాలి అని చెప్పారని రోహిత్ పవార్ వెల్లడించారు. అప్పట్లో ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదని, ఇప్పుడు ఈ ఘటనలన్నింటిని చూస్తే అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. తాను ఎవరినీ నేరుగా నిందించడం లేదని, కానీ ప్రతి కోణంలో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు.
