KC Tyagi : అధిక ప్లైట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సిందే : రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి డిమాండ్

ఇండిగో విమానాల సంక్షోభాన్ని ఎయిర్ ఇండియా సొమ్ము చేసుకుని అధిక ఛార్జీలు వసూలు చేసిందని రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ-ముంబై టికెట్‌కు తన మనవరాలి నుంచి మూడింతలు (రూ. 42,151) వసూలు చేశారని ఆరోపించారు.

KC Tyagi

విధాత, హైదరాబాద్ : ఇండిగో ఏయిర్ లైన్స్ విమానాల రద్ధు, ఆలస్యం ఘటనను ఏయిర్ ఇండియా సొమ్ము చేసుకుని జనం సొమ్ము లూటీ చేసిందని, ప్రయాణీల పట్ల నేరపూరితంగా వ్యవహరించిందని రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి ఘాటుగా విమర్శించారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు తన మనవరాలు ఏయిర్ ఇండియా ఫ్లైట్ లో టికెట్ తీసుకోగా, మూడింతలు అధికంగా అనగా రూ.42,151 ముక్కు పిండి వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. తన మనవరాలి నుంచి నుంచి రెండింతలు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖను డిమాండ్ చేశారు. తన ఒక్క మనవరాలు మాత్రమే కాదని ప్రతి ప్రయాణీకుడి నుంచి అధికంగా వసూలు చేసిన టికెట్ డబ్బులను వెనక్కి ఇప్పించాల్సిందేనని ఆయన అన్నారు.

కేసీ త్యాగి, రవాణా, పర్యాటక, సాంస్కృతిక‌ మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఒక సభ్యుడిగా ఆయన రవాణా స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కు ఏయిర్ ఇండియా అడ్డగోలు టికెట్ దోపిడి పై ఫిర్యాదు చేశారు. ఇండిగో ఏయిర్ లైన్స్ సంక్షోభం మొదలైన తరువాత ఎప్పటి నుంచి టికెట్ ధరలపై నియంత్రణ మొదలు పెట్టారనేది తెలియచేయాలని తన లేఖలో ప్రశ్నించారు. దేశీయ విమాన ప్రయాణంలో 500 నుంచి 1,500 కిలోమీటర్ల దూరం వరకు రూ.7,500 నుంచి రూ.18,000 వరకు టికెట్ ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డిసెంబర్ 6వ తేదీన ఖరారు చేసిందన్నారు. ఈ మేరకు ప్రైవేటు విమానయాన సంస్థలకు సర్క్యూలర్ కూడా జారీ అయ్యిందన్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలో ఇండిగో ఏయిర్ లైన్స్ సంక్షోభం పెద్ద ఉదాహారణ అన్నారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యం పై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డీజీసీఏ అధికారులు నడుచుకోవడం లేదని, అమలు చేయకుండా గాలికి వదిలేశారన్నారు. ప్రైవేటు విమానయాన సంస్థల ఆర్థిక దోపిడి, క్రూరంగా వ్యవహరించడం మూలంగా లక్షలాది మంది ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. డీజీసీఏ నిర్ధేశించిన ప్రకారంగా కాకుండా ఇష్టారాజ్యంగా టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్న చర్యలను తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు.

నేను ఏయిర్ ఇండియా సంస్థ ఏకపక్ష, క్రూరమైన దోపిడి బాధితుడిని అని కేసీ త్యాగి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. డీజీసీఏ విమాన టికెట్ రేట్లను నియంత్రించిన తరువాత ఏయిర్ ఇండియా సంస్థ ఆర్థిక దోపిడీ కొనసాగించిందంటూ ఆధారాలను సమర్పించారు. తన మనవరాలు డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీ నుంచి ముంబై కి ఏయిర్ ఇండియా విమానంలో ప్రయాణించగా, ఆమె నుంచి మూడింతలు టికెట్ రేట్ వసూలు చేసిందంటూ ఆయన వివరాలు వెల్లడించారు. నేను అందచేసే ఫిర్యాదుతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తో పాటు డీజీసీఏ చర్యలు ఏయిర్ ఇండియా పై కఠిన తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు కేవలం తన మనవరాలి కోసం కాదని, అధిక రేట్లతో నష్టపోయిన ప్రయాణీకుల అందరి తరఫున మాట్లాడుతున్నానని అన్నారు. ఇండిగో ఏయిర్ లైన్స్ సంక్షోభ సమయంలో అత్యధికంగా టికెట్ రేట్లు వసూలు చేసిన ఏయిర్ ఇండియా నుంచి ప్రతి ప్రయాణీకుడికి డబ్బులు వాపస్ ఇప్పించేలా డీజీసీఏ ను ఆదేశించాలని కేసీ త్యాగి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేది లేదని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన ఏయిర్ ఇండియా ను హెచ్చరించారు. ఏయిర్ ఇండియా సంస్థ ప్రస్తుతం టాటా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ
Duvvada Madhuri Srinivas| అది బర్త్ డే పార్టీ కాదు: దువ్వాడ మాధురి శ్రీనివాస్

Latest News