విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నారీ, నెట్‌క్రాకర్ టెక్నాలజీ కార్పొరేషన్(Nary, Netcracker Technology Corporation) ఆధ్వర్యంలో వరంగల్‌లో పీరియడ్ పేదరికాన్ని ఎదుర్కోవడానికి బృందాలు అవగాహన కార్యక్రమం నిర్వహించాయి.
నారి ఆధ్వర్యంలో వరంగల్‌లోని MH నగర్‌లో 5 రోజుల పీరియడ్ కేర్ కిట్ పంపిణీ డ్రైవ్(Period care kit distribution drive) నిర్వహించారు. ఈ డ్రైవ్‌కు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ నెట్‌క్రాకర్ టెక్నాలజీ కార్పొరేషన్ మద్దతు ఇస్తుంది. ఈ పీరియడ్ కేర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ పీరియడ్ పేదరిక నిర్మూలన దిశగా చేస్తున్న పనిలో ఒక ముందడుగని నారి సంస్థ ప్రతినిధులు ఇంజాపూరి పూర్ణ, యాట శ్రీలత, ఎండి జుబేదా, కూచన సువర్ణ చెప్పారు.
హనుమకొండలో సోమవారం వారు మాట్లాడారు. పీరియడ్ పేదరికం అనేది మిలియన్ల మంది బాలికలు, మహిళలను ప్రభావితం చేసే సంక్లిష్ట సమస్యగా చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం అవసరం. రుతుక్రమ విద్య, సురక్షితమైన పారిశుధ్య సౌకర్యాలు, ప్యాడ్‌లు పర్యావరణ అనుకూలమైన ప్రాంతాల్లో పారవేయడం వంటివాటిపట్ల అవగాహన అవసరమన్నారు. ఋతు పరిశుభ్రత, ఉత్పత్తుల పంపిణీతో పాటు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలపై వివరించారు.
పునర్వినియోగ క్లాత్ ప్యాడ్‌లు, రుతుక్రమం పట్ల అవగాహన కోసం యూత్ ఫ్రెండ్లీ సర్వీస్‌లు, పీరియడ్ పేదరికం సవాలును పరిష్కరిస్తాయని నారీ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
నారీ గత 8 సంవత్సరాలుగా బాలికలు, స్త్రీలలో పీరియడ్ కిట్‌ల కోసం శిక్షణా కార్యక్రమాలు, ఋతు పరిశుభ్రత, శిక్షణ, ఉచితంగా పీరియడ్ కిట్‌లను పంపిణీ చేస్తున్నామన్నారు. వరంగల్‌లో ఋతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు నారి ఎస్‌హెచ్‌జి సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షకులు నారీ మార్గదర్శకత్వం మరియు మద్దతుతో స్వతంత్రంగా డ్రైవ్, అవగాహనను నిర్వహిస్తున్నామన్నారు.