మేడిగడ్డ సంఘటనపై పోలీసు విచారణ

– మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

 – కుట్రకోణం దిశగా దర్యాప్తు

 – ప్రజల దృష్టి మళ్లించేందుకే అంటున్న విపక్షాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిన ఘటన వెనుకాల కుట్ర కోణం ఏమైనా దాగుందా? అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. మహాదేపూర్ పోలీస్ స్టేషన్ లో బరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఫిర్యాదు చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

427 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు ఎస్సై రాజ్ కుమార్ చెప్పారు. ఈ నెల 21న సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు పెద్ద శబ్దం వచ్చిందంటూ తమ ఫిర్యాదులో ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. 7 బ్లాక్ వద్ద 19, 20, 21 పిల్లర్లు కుంగినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.

ఇదిలాఉండగా వాస్తవాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామా ప్రారంభించారని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.