ఎన్నికల వేళ పెను సంచలనం సృష్టించిన మేడిగడ్డ బరాజ్ 20వ పిల్లర్ కుంగుబాటులో జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే నిమిషాల వ్యవధిలోనే రెండు ప్రెస్‌నోట్‌లు విడుదల చేయడం వివాదాస్పదమైంది. తొలుత విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో జరిగిన ప్రమాదం వెనుక కుట్ర కోణంగానీ, తుంటరి చర్యగానీ లేవని పేర్కొనగా.. ఆ వెంటనే కొద్ది నిమిషాలకు జారీ చేసిన నోట్‌లో ఆ రెండు అంశాలు మాయం అవడం రాజకీయవర్గాల్లో చర్చను రేకెత్తించింది. కేసు నమోదు చేసిన తేదీలో పొరపాటును సవరిస్తూ రెండో నోట్ జారీ చేసినట్టు చెబుతున్నా.. కీలకమైన కుట్ర కోణాన్ని తిరస్కరించడం, నిర్మాణపరమైన లోపమేనని వెల్లడించడం.. ఈ రెండు అంశాలు రెండో నోట్‌లో మాయమయ్యాయి. దానికి తోడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం బరాజ్‌ను పరిశీలించిందని, నిపుణుల కమిటీ నిర్ధారణ తర్వాత పోలీసులు ఒక నిర్ధారణకు రానున్నారని పేర్కొన్నారు.
నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన పిటిషన్ మేరకు పోలీసులు మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ 174/2023 యూ/ఎస్ ఐపీసీ427, సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ నమోదు చేశారని తాజా ప్రెస్‌నోట్‌లో తెలిపారు. మొదటి నోట్‌లో 23వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఉంటే.. రెండో దాంట్లో 22.10.2023న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. 21.10.2023న 1830గం.లకు ఎల్‌అండ్‌టి కార్మికులు వంతెన వంగినట్లు గమనించడంతో పాటు పిల్లర్‌లో పగుళ్లు కనిపించడంతో ఈ అంశంపై అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నీటిపారుదల శాఖ ఏఈ పోలీసులకు పిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్‌లు, క్లూస్ టీమ్‌ల ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ బ్యారేజీని పరిశీలించిందని, నిపుణుల కమిటీ నిర్ధారణ తర్వాత పోలీసులు ఓ నిర్ధారణకు రానున్నారని ఆ నోట్‌లో వెల్లడించారు. నీటిపారుదల శాఖ అభ్యర్థన మేరకు, భద్రతా సమస్యలు, ప్రమాదాల నివారణ కోసం మేడిగడ్డ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశామని పేర్కొన్నారు.
అగ్నిపరీక్ష ముందు మేడిగడ్డ
సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పుకొన్నట్లు.. తన మెదడును కరిగించి, ఇంజనీర్‌గా పరకాయ ప్రవేశం చేసి, రోజుల తరబడి శ్రమించి రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మించిన తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం. ఇందులోని మేడిగడ్డ బరాజ్ మూడేండ్లకే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది. ఎన్నికల వేళ బీఆరెస్ స్వయంగా శల్యపరీక్షకు లోనుకాగా, విపక్షాలు, ఇతరుల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. తమపై ఈగ వాలితేనే ఊగిపోయే అధికార పార్టీ పెద్దలు మౌనం దాల్చడంలో ఏదో మర్మం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే పిల్లర్ కుంగిపోయి, బరాజ్ ఉనికిపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ.. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు బీఆరెస్ నుంచి స్పందన కనిపించడంలేదని అంటున్నారు.
మరోవైపు స్థానిక మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఫిర్యాదు చేశారు. పెద్ద శబ్దంతో పిల్లర్ కుంగిపోవడంతో ఎదైనా కుట్ర కోణం ఉందా? ఎవరైనా బరాజ్‌కు ప్రమాదం తలపెట్టారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. కుట్ర దాగి ఉందో లేదో అనుమానం వ్యక్తం చేయడం ఇలాంటి సందర్భాల్లో అవసరమైన అంశమే అయినప్పటికీ ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, సంఘటన, నిర్మాణ లోపం, ప్రభుత్వ బాధ్యతను పక్కదోవపట్టించి, దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కుట్ర కోణం ఏమీ లేదని, నిర్మాణ లోపంతోనే వంతెన కుంగిందని ఎస్పీ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష నేతలు భగ్గుమన్నారు. కానీ.. ఆ వెంటనే ఎస్పీ తన ప్రకటనను సవరించుకోవడం చర్చనీయాంశమైంది.
బరాజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బరాజ్ 20వ పిల్లర్ కుంగిన సంఘటన నేపథ్యంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఎస్ .కే.శర్మ, ఆర్. తంగమణి, రాహుల్ కె. సింగ్, దేవేందర్ రావు, డిడి కెజీబీఓ సభ్యులు ఇందులో ఉన్నారు. కమిటీ ఈ బరాజ్‌ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది. 6 నుంచి 8 బ్లాకుల్లో 15 నుంచి 20 పిల్లర్ వరకు పరిస్థితి పరిశీలించారు. కుంగిన 20వ పిల్లర్ వద్ద ఎంత మేరకు కుంగిపోయిందో స్వయంగా పరిశీలించారు. కింద పిల్లర్‌ను నిచ్చెన వేసుకుని చూసినట్లు చెబుతున్నారు. బరాజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. సమగ్ర పరిశీలన తరువాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు.
బీఆర్ఎస్ నేతల వ్యూహాత్మక మౌనం
ప్రస్తుతం బీఆరెస్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నదని ఆ పార్టీ చరిత్రను ఆది నుంచీ పరిశీలించిన వారు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న అవకాశం చిక్కగానే ఆ పార్టీ నాయకులు గొంతెత్తి విపక్షాలపై విరుచుకపడుతారని అంటున్నారు. గతంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, తాజాగా టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్, ఇటీవలి విద్యార్ధిని ప్రవళిక ఆత్మహత్య సంఘటన అంశాల్లో ఆ పార్టీ ముఖ్యనాయకులు కేసీఆర్‌తోపాటు.. కేటీఆర్, హరీష్ రావు, కవిత స్పందించిన తీరును పలువురు ఉదహరిస్తున్నారు.
నాలుగు రోజులైనా స్పందించని సర్కారు
శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో పెద్ద శబ్దంతో మేడిగడ్డ బరాజ్ వంతెన 6 నుంచి 8 బ్లాకుల్లో 15 నుంచి 20 పిల్లర్ల మధ్య కుంగిపోయింది. 20 పిల్లర్ వద్ద పగుళ్ళు కనిపించాయి. గేటు కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన జరుగగానే మహరాష్ట్ర, తెలంగాణ మధ్య వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. చెక్ పోస్టు ఏర్పాటు చేసి, మీడియాతో సహా ఎవరినీ బ్రిడ్డి వైపు అనుమతించడంలేదు. బరాజ్ గేట్లు ఎత్తి నిల్వ ఉన్న 10 టీఎంసీల నీటిని యుద్ధప్రాతిపదికన దిగువకు విడుదల చేశారు. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ నేతల నుంచి తగిన స్పందన రాలేదు. శనివారం రాత్రి హుటాహుటిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరాజ్ ను సందర్శించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి సంస్థకు లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా ఇతర పార్టీల ప్రతినిధులు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వం, బీఆర్ఎస్ ఇరుక్కుంటున్నదా?
ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా నిజానిజాలు వెలికితీయడంకంటే ఈ సంఘటనల నుంచి తక్షణం బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వం, బీఆరెస్ ముఖ్యనేతలు ఇరుక్కుంటున్నారా? అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి. ప్రభుత్వం అన్నప్పుడు తప్పొప్పులు జరుగుతాయి. తప్పుల పట్ల నిజాయితీగా విచారణ చేపట్టి, దోషులను శిక్షిస్తే ప్రజల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కానీ, ఏ తప్పిదం జరిగినా దాన్ని తొక్కిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో అధికార పక్ష నేతలు ఇరుక్కుంటున్నారంటే.. ఆ తప్పిదంతో వీరి పాత్రైనా ఉండాలి.. లేదా తమ ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు జరుగలేదని చెప్పేందుకు తప్పులను ఒప్పులుగా చూపెట్టే ప్రయత్నంగానైనా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
బీఆరెస్.. రాష్ట్రంలో రెండవ పర్యాయం అధికారాన్ని చెలాయిస్తూ మూడోసారి అధికారం కోసం ఆరాటపడుతున్నది. ఈ క్రమంలో పలు సంఘటనల పైన ఆరోపణలు వచ్చినా వాటిని ప్రణాళిక బద్దంగా తొక్కిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయితే.. ఎంత సేపు సమర్ధించుకునే యత్నం తప్ప ప్రక్షాళనకు ప్రయత్నించకపోవడం బహిరంగ సత్యమే. ఇటీవల ప్రవళిక సంఘటనలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రక్షాళన చేస్తామని ప్రకటించడం ఎన్నికల ప్రకటన తప్ప అందులో నిజాయితీ లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏదైనా సంఘటన జరిగితే తమ తప్పూ, తమ సర్కారు తప్పు బయటపడకుండా ముందు మౌనం పాటించడం రివాజుగా మారింది. అనుకూల మీడియా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుందని, కొద్ది రోజులకు నెమ్మదిగా ఎదురుదాడికి సిద్ధం కావడం అలవాటుగా మారింది.
ఇందులో ఏదైనా ఒక్క అంశం లభిస్తే ఇల్లు పీకి పందిరేసినట్లు తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారాన్ని చేపడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రవళిక ఆత్మహత్య సంఘటనలో ఆమె పరీక్షకే దరఖాస్తు చేయలేదంటూ మంత్రి కేటీఆర్ బుకాయించారు. దీని పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రేమ వ్యవహారంగా మార్చి వేశారు. ఆఖరికి ప్రవళిక తల్లి, తమ్ముడు మాట మార్చి ప్రేమ వ్యవహారంగా తీర్చదిద్దడంతో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందనేది బహిరంగ సత్యం. తాజాగా మేడిగడ్డ సంఘటన జరుగగానే మౌనం వహించారు. కుట్రకోణముందంటూ ఫిర్యాదు చేయించారు. కేంద్ర బృందం స్పందనను సానుకూలంగా మార్చుకుని ఒకటి,రెండు రోజుల్లో నేతలు తీవ్రంగా స్పందిస్తారని, ఎదురుదాడికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.
మేడిగడ్డ సంఘటనకు బాధ్యులెవరు
మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగిపోయిన సంఘటనకు బాధ్యులెవరనేది తేలాల్సి ఉన్నది. తమ పరిధిలో సంఘటన జరిగితే విచారణ జరిపి బాధ్యులను శిక్షించాల్సిన ప్రభుత్వం ఎందుకో ఇరుకునపడుతున్నది. దీనికి కారణం ప్రతీ అంశంలో తమ పరిధిదాటి జోక్యం చేసుకోవడమేనని అంటున్నారు. అధికారులను బాధ్యులను చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు తామే దోషులుగా నిలుస్తున్నారు. మేడిగడ్డ వ్యవహారంలో సీఎం కేసీఆర్ అన్ని తానే చేశానని చెప్పుకోవడం ఇప్పుడు కొంప ముంచే పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో అధికారులను బాధ్యులను చేయలేక పోతున్నారనే చర్చ సాగుతున్నది. ఈ తప్పిదం వల్ల మేడిగడ్డ బరాజ్ ప్రమాదంలోకి వెళ్ళిందంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.1849 కోట్ల వ్యయంతో ఎల్ టీ సంస్ధ 24 నెలల్లో బరాజ్‌ను పూర్తి చేసింది. దీనిని 16.17 టీఎంఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించారు.
బరాజ్ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా, 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. తాజాగా పిల్లర్ కుంగిపోవడంతో బరాజ్‌లోని 10 టీఎంసీ నీటిని వృథాగా కిందికి విడుదల చేయాల్సి వచ్చింది. ఎగువ నుంచి వస్తున్న 22,500 క్యూసెక్కుల నీటిని కూడా కిందకు వదిలేస్తున్నారు. బరాజ్ పిల్లర్ల అడుగు భాగంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలన్నా, మరింత ముప్పు వాటిల్లకూడదన్నా.. నీటిని విడుదల చేయకతప్పని పరిస్థితి. ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు ఈ పరిస్థితి తలెత్తడం ప్రభుత్వానికి, బీఆరెస్‌కు ఇబ్బందిగా మారింది.