విధాత: ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల జాబితాలో ప్రపంచంలోనే పురాతన విజ్ఞాన సంప్రదాయం కలిగిన భారతదేశం నుంచి ఏ విద్యా సంస్థ లేకపోవడం దారుణమని, దీనిపై గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ర్యాంకింగ్‌ల కంటే మంచి విద్య అవసరమని పేర్కొన్నారు. మంచి ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను, అధ్యాపకులను ఆకర్షించడమే కాకుండా దేశ ఖ్యాతిని కూడా పెంచుతుందని చెప్పారు.
పశ్చిమబెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ 69వ స్నాతకోత్సవంలో సోమవారం ఆమె ప్రసంగిస్తూ.. “ప్రపంచంలోని అత్యంత పురాతనమైన జ్ఞాన సంప్రదాయం ఉన్న ఇంత విశాలమైన భారతదేశం నుంచి ఒక్క విద్యాసంస్థ కూడా ప్రపంచ టాప్ 50 విద్యాసంస్థల జాబితాలో చోటు సాధించలేకపోయింది. మనం దాని గురించి ఆలోచించాలి. మంచి విద్య కంటే ర్యాంకింగ్ కోసం రేసు ముఖ్యం కాదు. కానీ, మంచి ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, మంచి అధ్యాపకులను ఆకర్షించడమే కాకుండా దేశ ఖ్యాతిని కూడా పెంచుతుంది”అని ఆమె చెప్పారు.
దేశంలోనే అత్యంత పురాతనమైన ఐఐటీ ఖరగ్‌పూర్ ఈ దిశగా కృషి చేయాలని ముర్ము పిలుపునిచ్చారు. “ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి సంస్థలు ఆవిష్కరణలు, సాంకేతికత ద్వారా ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, దానిని అమలు చేయడానికి వారు విప్లవాత్మక ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వాన్ని పెంపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత కాదనలేదని పేర్కొన్నారు. టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. “ఐఐటీలు ప్రతిభ, సాంకేతికత ఇంక్యుబేషన్ కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ దేశంలోనే తొలి సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ దాదాపు 73 సంవత్సరాల ప్రయాణంలో గొప్ప ప్రతిభను అందించింది. దేశ అభివృద్ధికి దాని సహకారం సాటిలేనిది” అని తెలిపారు.