Site icon vidhaatha

Wrestlers Protest | రాజీపడాలని ఒత్తిడి చేశారు: రెజ్లర్లు

Wrestlers Protest

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదు చేసిన రెజ్లర్లలోని మైనర్‌.. తీవ్ర ఒత్తిడి వల్లే తన వాంగ్మూలాన్ని మార్చినట్టు ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ తెలిపారు. ఈ వివాదంలో రాజీకి రావాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నదని ఆమె చెప్పారు.

ఒక ఆంగ్ల వార్తా చానల్‌కు రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రిజ్‌భూషణ్‌ తన మనుషులతో ఫోన్లు చేయించి ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారని వారు తెలిపారు. ఫిర్యాదును వాపసు తీసుకోవాలని మైనర్‌ తండ్రిపై ఒత్తిడి చేయడంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసి, కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిందేనని తాము మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నామని సాక్షి మాలిక్‌ గుర్తు చేశారు. లేదంటే ఆయన దర్యాప్తును పక్కదోవ పట్టించి, సాక్షులను, ఫిర్యాదుదారులను బెదిరించే అవకాశం ఉన్నదని చెప్పారు.

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయనిదే ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరుగదని ఆమె స్పష్టం చేశారు. జూన్‌ 15 లోగా ఏదో ఒక చర్య తీసుకోవాలని మహాపంచాయ్‌ గడువు పెట్టిందని, ఆ గడువు తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని బజరంగ్‌ పునియా చెప్పారు. ఆయనను అరెస్టు చేయాలన్న తమ డిమాండ్‌పై వెనక్కు తగ్గలేదని స్పష్టం చేశారు.

పోలీసుల దర్యాప్తును తాము విశ్వసించలేమని చెప్పారు. ‘దర్యాప్తు కోసం ఒక మహిళా రెజ్లర్‌ను బ్రిజ్‌భూషణ్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. బ్రిజ్‌భూషణ్‌ అక్కడ లేరని పోలీసులు అబద్ధం చెప్పారు. కానీ.. ఆయనను అక్కడ చూసి మహిళా రెజ్లర్‌ భయకంపితులయ్యారు’ అని పునియా చెప్పారు. మొత్తం వ్యవస్థ బ్రిజ్‌భూషణ్‌ను రక్షిస్తున్నదని ఆయన ఆరోపించారు.

Exit mobile version