విధాత: పాలమూరును పచ్చగ చేయాలని కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టింది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసే, కానీ మేం కట్టిన ప్రాజెక్టుల వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫొటోలు దిగుతున్నారు. బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్లనే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత,గిరిజన ఆత్మగౌరవం సభ జరిగింది. సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాగం జనార్దన్‌రెడ్డిలు హాజరయ్యారు. నేతలకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేసిన భూస్వాములను, దొరలను తరిమిన చరిత్ర ఈ గడ్డది. నాలుగేళ్లు అయినా నాగర్‌కర్నూల్ ప్రాజెక్టులు అడుగు పడలేదు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన నాగంపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దళిత, గిరిజనులను బీఆర్‌ఎస్ నేతలు అవమానిస్తున్నారని, వారిపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దొరలకు బీఆర్‌ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉన్నదని, దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఈ పార్టీ మీది.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. పాలమూరులో మొత్తం సీట్లను గెలిపించే బాధ్యత నాది. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. సీఎం పదవి ఎవరికి ఇచ్చినా వారిని కుర్చీలో కూర్చోబెట్టే బాద్యత నాది అని రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. దళిత, గిరిజనులకు మద్దతుగా ఇక్కడికి వచ్చామన్నారు. వాల్యా నాయక్‌పై కాలుతో దాడి చేసిన ఘటన కలిచివేసిందని, దళిత, గిరజనులపై దాడిని నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామన్నారు.